ఎస్‌పీ–బీఎస్పీ పొత్తు మాకు సవాలే | Sakshi
Sakshi News home page

ఎస్‌పీ–బీఎస్పీ పొత్తు మాకు సవాలే

Published Sat, May 26 2018 3:34 AM

SP-BSP alliance in Uttar Pradesh will be challenge for BJP in 2019 - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పీ–బీఎస్పీ మధ్య పొత్తు కుదిరితే 2019 ఎన్నికల్లో బీజేపీకి సవాలే అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అంగీకరించారు. అయితే అమేథీ, రాయ్‌బరేలీలో ఏదో ఒక సీటులో కాంగ్రెస్‌ను కచ్చితంగా బీజేపీ ఓడిస్తుందని చెప్పారు. ఎన్‌డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అమిత్‌షా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేసుకోవాలనే ఆలోచన తమకు లేదని శివసేనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2019లో ఎన్‌డీఏను ఓడించలేమని అర్థమయ్యే ప్రతిపక్షాలు అన్నీ ఏకమై లేనిపోని విమర్శలు చేస్తున్నాయన్నారు. గత ఎన్నికల్లో గెలుపొందని ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలోని 80 సీట్లను వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ సాధిస్తుందన్నారు.

రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో సీఎంలను మార్చబోమన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం గత నాలుగేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా 22 కోట్ల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరిందని అమిత్‌షా చెప్పారు. ప్రభుత్వ విజయాలపై దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు ‘సరైన ఉద్దేశాలు, సరైన అభివృద్ధి(సాఫ్‌ నియత్, సాహీ వికాస్‌) అనే సరికొత్త నినాదంతో ముందుకు వెళతామని చెప్పారు. బహుళ పార్టీ ప్రజాస్వామ్యం విఫలమైందనే ఆలోచనలు ప్రజల మదిలోకి వస్తున్న సమయంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు కొత్త ఆశను కలిగించిందని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రతి రంగంలోనూ ఆచరణయోగ్యమైన, స్పష్టమైన చర్యలు తీసుకుందని, దీని ద్వారా తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, అదే సమయంలో పరిశ్రమలకు సహాయకారిగా ఉందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుందని చెప్పారు.

Advertisement
Advertisement