మూడు స్థానాల్లో పోటీయే లేదు 

Siddipet, Dubbak, Medak TRS  win - harish rao - Sakshi

సిద్దిపేట, దుబ్బాక, మెదక్‌లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయం 

భారీ మెజార్టీ కోసం కార్యకర్తలు కృషి చేయాలి: హరీశ్‌రావు

చేగుంట (తూప్రాన్‌): ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి అసలు పోటీయే లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట, దుబ్బాక, మెదక్‌ నియోజకవర్గాల్లో పార్టీ విజయం ఖాయమని పేర్కొన్నారు. గురువారం మెదక్‌ జిల్లా చేగుంటలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంతోపాటు నార్సింగిలో జరిగిన బైక్‌ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేగుంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విపక్షాలపై ధ్వజమెత్తారు. మహాకూటమి నుంచి సిద్దిపేట, దుబ్బాక, మెదక్‌ నియోజకవర్గాల్లో టీజేఎస్‌ పోటీ చేస్తుందని ముందునుంచీ ప్రకటించగా, ఇప్పడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎందుకు పోటీలో ఉన్నారో అర్థం కావడంలేదన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఓట్ల సమయంలో మాత్రమే నాయ కులు వచ్చి ట్రస్టుల పేరు చెప్పుకుంటారని తెలిపారు. కొందరు ట్రస్టుల పేరుతో చెల్లని చెక్కులను అందిస్తున్నారన్నారు. డబ్బులు పంచే నాయకులు గెలిచిన తర్వాత ఖర్చు చేసిన డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారని ప్రజల సంక్షేమం వారికి పట్టదని పేర్కొన్నారు.

దుబ్బాక అభివృద్ధిని నిరంతరం కోరుకునే మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రామలింగారెడ్డికి మద్దతుగా పార్టీలో చేరడం గొప్ప విషయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టునుంచి దుబ్బాకకు సాగునీరు అందిస్తామన్నారు. మరో మూడు నెలల్లో కాళేశ్వరం పనులను పూర్తిచేసి మోటార్లను ప్రారంభిస్తామన్నారు. సిద్దిపేటను మించి దుబ్బాకలో రామలింగారెడ్డికి భారీ మెజార్టీ తీసుకురావడానికి కార్యకర్తలు పోటీ పడాలన్నారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిచేరిన కార్యకర్తలకు సైతం సరైన సమయంలో సముచిత స్థానం కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్‌ సత్తాను చాటాలని కార్యకర్తలకు సూచించారు. రామలింగారెడ్డి మాట్లాడుతూ శత్రు దేశాల ముష్కరుల దాడిని తిప్పికొట్టడానికి పహారా కాస్తున్న సైనికుల్లా కార్యకర్తలు టీర్‌ఎస్‌ను కాపాడుతున్నారని.. ఇదే స్ఫూర్తితో పని చేయాలని కోరారు. చేగుంట, దౌల్తా బాద్‌ మండలాలకు చెందిన వందలాది మంది కాం గ్రెస్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం నార్సింగి వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు వెంగళ్‌రావ్, అల్లి రమ పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top