రాసిస్తేనే మద్దతిస్తాం..

Shiv Sena seeks written assurance from BJP over power sharing in maharashtra - Sakshi

ఆదిత్య ఠాక్రేకు సీఎం పదవి

మంత్రివర్గంలో సమాన వాటా

బీజేపీ లిఖితపూర్వక హామీకి శివసేన పట్టు

వేరే మార్గాలున్నాయని హెచ్చరిక

సీఎం పీఠం తమదేనంటున్న బీజేపీ

సాక్షి ముంబై: మరాఠా రాజకీయం వేడెక్కుతోంది. సంకీర్ణంలో పదవుల పంపకంపై శివసేన పట్టు బిగించింది. ముఖ్యమంత్రి పదవి ఆదిత్య ఠాక్రేకు ఇవ్వడంతోపాటు మంత్రి పదవుల్లో సమాన వాటా కల్పిస్తామంటూ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలంటూ బీజేపీపై ఒత్తిడి తెస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో శనివారం తన నివాసం మాతోశ్రీలో శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే భేటీ అయ్యారు. సమావేశం అనంతరం శివసేన ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్నాయక్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా పార్టీ ఎమ్మెల్యేలంతా రెండున్నరేళ్లు ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రి పదవుల్లో సమాన వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, యువసేన చీఫ్, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే(29)కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో లిఖిత పూర్వకంగా బీజేపీ హామీ ఇచ్చేదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలిపారు’అని వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సమాన వాటా ఇస్తామంటూ లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉద్ధవ్‌ ఠాక్రేకు ఇచ్చిన హామీని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా నెరవేర్చాల్సిందేనని పట్టుబట్టారన్నారు. బీజేపీ, శివసేన హిందుత్వకు కట్టుబడి ఉన్నాయని, అందుకే ప్రత్యామ్నాయాలున్నా వాటిపై ఆసక్తి లేదని ఉద్దవ్‌ ఠాక్రే పేర్కొన్నారని సర్నాయక్‌ తెలిపారు.

సీఎం పదవి మాదే: బీజేపీ ఇన్‌చార్జి సరోజ్‌ పాండే
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠం తమ పార్టీదేనని బీజేపీ మహారాష్ట్ర ఇన్‌చార్జి సరోజ్‌ పాండే స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ఊహించిన దానికంటే 17 సీట్లు తగ్గినా 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. మిత్రపక్షమైన శివసేనకు కూడా ఏడు సీట్లు తగ్గి, 56 సీట్లు గెలుచుకుందని తెలిపారు. దీపావళి తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై ఉద్ధవ్‌తో సీఎం ఫడ్నవిస్‌ చర్చలు జరుపుతారని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత రావుసాహెచ్‌ దన్వే వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా ఈ నెల 30న సమావేశమై శాసనసభా పక్షం నేతను ఎన్నుకోనున్నారు. సీఎం ఫడ్నవిస్‌ స్వతంత్రులు, చిన్న పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మేం ప్రతిపక్షంలోనే: పవార్‌
ప్రభుత్వం ఏర్పాటులో శివసేనకు ఎన్‌సీపీ మద్దతిస్తుందంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ స్పందించారు. ‘మేం ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారు. ఆ తీర్పును పాటిస్తాం’అని పేర్కొన్నారు. ‘ప్రతిపక్షంగా ఉండాలనే ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రజాతీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవ్వాలనుకుంటే శివసేననే ముందుగా స్పందించాలి’అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విజయ్‌ వడెత్తివార్‌ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీని అధికా రం నుంచి తప్పించేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తామని మాజీ సీఎంలు చవాన్, పృథ్వీరాజ్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top