బీజేపీ లేకుండానే ప్రభుత్వ ఏర్పాటు: శివసేన

Shiv Sena Says Can Form Govt in Maharashtra Without BJP - Sakshi

ముంబై : బీజేపీ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల సత్తా తమకు ఉందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. మహారాష్ట్రకు కచ్చితంగా శివసేన నాయకుడే ముఖ్యమంత్రి అవుతారని.. ఇందులో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంబన వీడని విషయం తెలిసిందే. కూటమిగా ఎన్నికల బరిలో దిగిన కాషాయ పార్టీలు బీజేపీ- శివసేన మధ్య ‘ముఖ్యమంత్రి పీఠం’ చిచ్చుపెట్టింది. ఐదేళ్లపాటు తానే మహారాష్ట్ర సీఎంగా ఉంటానని బీజేపీ శాసనసభా పక్షనేత దేవేంద్ర ఫడ్నవిస్‌ స్పష్టం చేయగా... సీఎం పదవిపై శివసేన పట్టువీడటం లేదు. అంతేగాకుండా ఎన్సీపీ అధినేత శరద్‌తో పవార్‌ చర్చలకు తెరలేపి మహా రాజకీయాన్ని రసకందాయకంలో పడేసింది.

ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శరద్‌ పవార్‌ను ఆయన నివాసంలో కలుసుకున్న అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదన్నారు. ‘ మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి శివసేన నుంచే ఉంటారు. ఉద్ధవ్‌ ఠాక్రే కూడా ఇదే చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు మాకు మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంది. మెజారిటీలేని వారు ప్రభుత్వ ఏర్పాటు చేసే ధైర్యం చేయలేరు. ప్రజలు శివసేన సీఎంను కోరుకుంటున్నారు. మా నాయకులు, కార్యకర్తలు వ్యాపారులు కారు. ఈ విషయం అందరూ గుర్తు పెట్టుకుంటే మంచిది’ అని బీజేపీకి చురకలు అంటించారు. కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top