ఆర్టికల్‌ 370 రద్దు; మాకు పాఠాలు చెప్పొద్దు

Shashi Tharoor Says Congress Stands With Kashmiri People - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ వాదం​ గురించి కాంగ్రెస్ పార్టీకి పాఠాలు చెప్పాల్సిన పని లేదని ఎంపీ శశిథరూర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఎల్లప్పుడు కశ్మీర్‌ పౌరులకు మద్దతుగా నిలబడుతుందని ప్రకటించారు. కశ్మీరీలు మన తోటి పౌరులని గర్వంగా చెబుతామన్నారు. జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై ప్రస్తుతం లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూను నిందించడం సరికాదన్నారు. ఆర్టికల్‌ 370 రూపకల్పనలో సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ పాత్ర ఉందని వెల్లడించారు.

ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయాన్ని చీకటి దినంగా కాంగ్రెస్‌ పార్టీ వర్ణించడంపై వివరణయిస్తూ.. ‘జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను అరెస్ట్‌ చేశారు. లోక్‌సభలో మన సహచరుడు ఫరూఖ్‌ అబ్దుల్లా ఏమయ్యారో తెలియడం లేదు. అఖిలపక్ష నాయకులను కశ్మీర్‌ తీసుకెళ్తే అక్కడ పరిస్థితులను స్వయంగా అంచనా వేసేవార’ని శశిథరూర్‌ అన్నారు. అయితే ఫరూఖ్‌ అబ్దుల్లా సొంత ఇంట్లోనే ఉన్నారని, ఆయనను నిర్బంధించలేదని హోంమంత్రి అమిత్‌ షా వివరణయిచ్చారు.

కశ్మీర్‌లో కొత్త శకం: గల్లా జయదేవ్‌
ఒకే దేశం, ఒకే రాజ్యాంగానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ తెలిపారు. 370 అధికరణను రద్దు చేయడం ద్వారా 70 ఏళ్ల క్రితం జరిగిన తప్పును సరిచేశారని వ్యాఖ్యానించారు. ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం కశ్మీర్‌కు ఎంతో మేలు జరుగుతుందని, రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. జమ్మూ కశ్మీర్‌లో కొత్త శకం ప్రారంభమైందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top