అధికారపార్టీలో ఉండి సిగ్గుగా ఉంది సార్‌!

Sarpanch worried infront of minister - Sakshi

ఎస్సీ కాలనీలో సీసీరోడ్లు కూడా వేయలేకపోయా

మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌తో గుడిపాడు సర్పంచ్‌ ఆవేదన  

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు టౌన్‌ : ‘సార్‌ నేషనల్‌ హైవేపై మా గ్రామం ఉంది. 6 వేల మంది జనాభా, 4,800 ఓట్లు ఉన్నాయి. అధికారపార్టీ సర్పంచ్‌గా ఉండి ఒక్క పని కూడా చేయలేకపోతున్నా, సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది’’ అని దువ్వూరు మండలం గుడిపాడు  సర్పంచ్‌ కొండారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక రింగ్‌రోడ్డులో ఉన్న శ్రీదేవి ఫంక్షన్‌ హాల్‌లో జమ్మలమడుగు డివిజన్‌ స్థాయి సమావేశంలో సర్పంచ్‌ కొండారెడ్డి మాట్లాడుతూ తమ గ్రామ పరిస్థితి చూస్తే బాధేస్తోందని వాపోయారు. గత కలెక్టర్‌ సత్యనారాయణకు గ్రామంలో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరుచేయాలని నివేదికను ఇచ్చామని, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేష్‌బాబును కలిశామని, రూ.80లక్షలు ఇచ్చినా ఎస్సీకాలనీలో సీసీరోడ్లు నిర్మించుకోలేకపోయామని చెప్పారు. తమకు ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేయలేదని వాపోయారు. ఇంత నిస్సాహాయ స్థితిలో ఉన్నానని సర్పంచ్‌ చెప్పడంతో మంత్రి ఆదినారాయణరెడ్డి కలుగజేసుకుని డివిజన్‌లో 175 గ్రామపంచాయతీలకు సంబంధించి సమస్యలు, ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పాలి తప్ప మీ ఒక్క గ్రామం గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ మాట్లాడుతూ మంత్రి లోకేష్‌ రూ.కోటి విడుదల చేయాలని చెప్పారని, అయితే గ్రామంలో ఎవరూ ఉపాధి హామీ పనులు చేయకపోవడం వల్ల ఆ నిధులు రాలేదని చెప్పారు. చట్టానికి లోబడే నిధులు విడుదలవుతాయని, పనులు చేయకుండా నిధులు రావాలంటే ఎలా అని అన్నారు. సర్పంచ్‌ కొండారెడ్డి మాట్లాడుతుండగా అధికారులు మైక్‌ తీసుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top