సమాజమా? కుటుంబమా?

Samajwad Party Profile And Graph - Sakshi

పార్టీ ప్రొఫైల్‌  సమాజ్‌వాదీ పార్టీ

యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ప్రస్థానం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రెండు ప్రధాన ప్రాంతీయ రాజకీయ పక్షాల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఒకటి. జేడీయూ, ఆర్జేడీ, జేడీఎస్, ఎల్జేపీ మాదిరిగానే ఎస్పీని కూడా జనతా పరివార్‌ పార్టీగానే పరిగణిస్తారు. ప్రసిద్ధ సోషలిస్ట్‌ నేత రామ్‌మనోహర్‌ లోహియా స్థాపించిన సోషలిస్ట్‌ పార్టీ (ఎస్పీ), ఏఏస్‌పీ మూలాలు, సిద్ధాంతాల వారసత్వం తమదని ఈ పార్టీ ప్రకటించింది. 1992 అక్టోబర్‌లో స్థాపించినప్పటి నుంచీ ములాయంసింగ్‌ యాదవ్, ఆ తర్వాత 2017 జనవరి ఒకటి నుంచీ ఆయన కొడుకు అఖిలేశ్‌ యాదవ్‌ ఎస్పీ అధ్యక్షులుగా ఉన్న కారణంగా ఇది ములాయం కుటుంబ పార్టీగా ముద్రపడింది. అనేక రాష్ట్రాల్లో శాఖలు, రెండు మూడు రాష్ట్రా ల్లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలున్నా ప్రధానంగా యూపీకి చెందిన పార్టీగానే ఎస్పీకి గుర్తింపు వచ్చింది.

పార్టీ స్థాపక అధ్యక్షుడు ములాయం 1989 డిసెంబర్‌లో మొదటిసారి జనతాదళ్‌ తరఫున యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఏడాదిన్నర తర్వాత పదవి నుంచి వైదొలగే నాటికి మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ జనతా పార్టీ (ఎస్జేపీ)లో ములాయం ఉన్నారు. తర్వాత జనతా పరివార్‌ పార్టీలకు చెందిన పూర్వపు సోషలిస్టులు, ఇతర నేతలతో కలిసి ములాయం సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. లోహియాతో ప్రత్యక్ష పరిచయం ఉన్న ములాయం 1967 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లోహియా నేతృత్వంలోని సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ టికెట్‌పై తొలిసారి ఎన్నికయ్యారు. తర్వాత చరణ్‌సింగ్‌ నేతృత్వంలోని బీఎల్డీ, అనంతరం జనతాపార్టీ, లోక్‌దళ్, జనతాదళ్‌లో కొనసాగారు. 1977 యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వా త జనతా పార్టీ తరఫున సీఎం పదవికి ములాయం పేరు కూడా పరిశీలించారని చెబుతారు.

బీఎస్పీ పొత్తుతో దశ మారింది
1993 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాన్షీరామ్‌ నేతృత్వంలోని బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం ఎస్పీకి కీలక మలుపు. బీజేపీకి వ్యతిరేకంగా ఈ కూటమి గట్టి ప్రచారం చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా (177 సీట్లు) అవతరించినా మెజారిటీ దక్కలేదు. ములాయం నేతృత్వంలో ఏర్పడిన ఎస్పీ (109), బీఎస్పీ (67) సంకీర్ణ సర్కారుకు జనతాదళ్, కాంగ్రెస్‌ తదితర బీజేపీ వ్యతిరేక పార్టీలు మద్దతు ఇచ్చాయి. రెండు భాగస్వామ్యపక్షాల మధ్య పరిపాలనకు సంబంధించిన వ్యవహారాల్లో విభేదాలు రావడంతో ములాయం ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్టు బీఎస్పీ ప్రకటించడంతో చివరికి ములాయం 1995 జూన్‌లో రాజీనామా చేశారు. దీనికి ముందు లక్నో గెస్ట్‌హౌస్‌లో ఉన్న మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడిచేయడంతో రెండు పార్టీల మధ్య బద్ధవైరం ఏర్పడింది. ఇది కిందటేడాది యూపీలో జరిగిన మూడు లోక్‌సభ ఉప ఎన్నికల్లో చేతులు కలిపే వరకూ కొనసాగింది.

యునైటెడ్‌ ఫ్రంట్‌ సర్కారులో ఎస్పీ
1996 లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు సాధించిన ఎస్పీ జనతాదళ్‌ నేతలు హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ నాయకత్వాన ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాల్లో భాగస్వామిగా చేరింది. ములాయం ఈ రెండు ప్రభుత్వాల్లో రక్షణమంత్రిగా పనిచేశారు. బీజేపీ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి నాయకత్వాన రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఏఐఏడీఎంకే వైదొలిగాక 1999 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం ఒక ఓటు తేడాతో వీగిపోయింది. వాజ్‌పేయి రాజీనామా తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వానికి మద్దతిస్తానని మొదట సీపీఎం ప్రధాన కార్యదర్శి హరికిషన్‌సింగ్‌ సుర్జీత్‌కు హామీ ఇచ్చిన ములాయం తర్వాత మాట మార్చారు. అప్పుడు ఎస్పీకి లోక్‌సభలో 20 మంది సభ్యులున్నారు. ఈలోగా సోనియా రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ను కలిసి తనకు 273 మంది లోక్‌సభ సభ్యుల మద్దతు ఉందని ప్రకటించారు. దీంతో తాను ప్రభుత్వం ఏర్పాటు చేయలేనని సోనియా ప్రకటించారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య వైరం కొనసాగింది. యూపీలో బీజేపీ బలమైన పార్టీ  కావడం, కాంగ్రెస్‌ను ఇక్కడ బలపడేలా చేస్తే తన ఉనికికే ప్రమాదమనే భావనతో ఎస్పీ ఇప్పటికీ వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన ఎస్పీ 26 సీట్లు సాధించింది.

యూపీఏలోకి నో ఎంట్రీ
వాజ్‌పేయి పాలన కాలంలో బీజేపీతో ఎస్పీ లోపాయికారీ సంబంధాలు కొనసాగించింది. 2003 ఆగస్టులో మాయావతి సర్కారు కూలిపోయాక బీఎస్పీని చీల్చిన ములాయం
ముఖ్యమంత్రి కావడానికి కేంద్ర సర్కారు పరోక్షంగా సాయపడింది. ఇలా ఫిరాయింపుదారులతో ములాయం దాదాపు మూడేళ్లు సీఎంగా కొనసాగారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ 36 సీట్లు సాధించినా పాత వైరం వల్ల, అప్పటికే మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టడం వల్ల మ న్మోహన్‌సింగ్‌ నాయకత్వాన ఏర్పడిన యూపీఏ సర్కారులో ఎస్పీకి ప్రవేశం లభించలేదు. అయితే, బయటి నుంచి మద్దతు ఇస్తున్న వామపక్షాలు 2008 జూలైలో యూపీఏతో తెగతెంపులు చేసుకున్నాయి. అప్పుడు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి ఎస్పీ మద్దతు ఇవ్వడం ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. కాంగ్రెస్‌తో ఈ

స్నేహం 2009
లోక్‌సభ ఎన్నికల వరకూ కొనసాగలేదు. ఈ ఎన్నికల్లో ఎస్పీ 23 సీట్లు గెలుచుకుంది. ఈసారీ యూపీఏలో చేరే అవకాశం ఎస్పీకి దక్కలేదు. యూపీఏ–2 హయాంలో 2012లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ విపరీతంగా ప్రచారం చేశారు. కాం గ్రెస్, ఎస్పీ మధ్య మాటల యుద్ధం సాగింది. చివరికి ఎస్పీ మొదటిసారి సొంతంగా పూర్తి మెజారిటీ సాధించింది. ములాయం కొడుకు అఖిలేశ్‌ అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యా రు. అనంతరం 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీకి ఐదు సీట్లే వచ్చాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్పీలో కుటుంబ తగాదా ముదిరింది. అఖిలేశ్‌ మంత్రివర్గంలో పీడబ్ల్యూడీ మంత్రి, ఆయన చిన్నాన్న శివపాల్‌సింగ్‌ యాదవ్‌ తన అన్న ములాయం పక్షాననిలబడ్డారు. పార్లమెంటులో ఎస్పీ నేత, సమీప బంధువు రాంగోపాల్‌ యాదవ్‌ అఖిలేశ్‌తో జత కలిశారు. పరస్పర బహిష్కరణల తర్వాత యాదవ్‌ పరివారంలో ముసలం ముగిసింది. రాజీ కుదిరింది. జనవరి ఒకటిన అఖిలేశ్‌ ఎస్పీ జాతీయ అధ్యక్షుడయ్యారు. అయితే, 2017 మార్చి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా ఎస్పీ బలం ఎన్న డూ లేనంతగా 54 సీట్లకు తగ్గిపోయింది. బీజేపీ దూకుడును తట్టుకుని యూపీలో తన ఉనికి కాపాడుకోవడానికి ఎస్పీ.. బీఎస్పీతో చేతులు కలిపింది. కిందటేడాది ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల ప్రయోజనం లేదని గ్రహించి బీఎస్పీతో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు చేసుకుంది. ఈ రెండు పార్టీల పొత్తు ఎంత కాలం సాగేదీ వచ్చే ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయి.

లోక్‌సభలో ఎస్పీ గ్రాఫ్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top