టీడీపీకి రేవంత్‌ రెడ్డి గుడ్‌బై....

Revanth Reddy Resignation from TDP

సాక్షి, అమరావతి : అనుకున్నట్లే జరిగింది...తెలుగుదేశం పార్టీకి కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి గుడ్‌బై చెప్పారు. శనివారం విజయవాడలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన పదవులతో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.  రేవంత్‌ రెడ్డి తన రాజీనామా లేఖను చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శికి అందచేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం రేవంత్‌ రెడ్డి మౌనంగా బయటకు వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. రేవంత్‌ రెడ్డితో పాటు వేం నరేందర్‌ రెడ్డి కూడా టీడీపీకి రాజీనామా చేసినట్లు సమాచారం.

కాగా కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా భాదించాయని, పార్టీపై, పార్టీ అధ్యక్షుడిపై తనకు ఎంతో గౌరవం నుందని తెలిపారు. తనను తక్కువ సమయంలో పార్టీ ఉన్నత పదవులను నిర్వహించేలా చేసిందని, తన ఎదుగుదలకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు తనకు తండ్రితో సమానమని, తాను ఎల్లప్పుడూ పార్టీ, కార్యకర్తల శ్రేయస్సు కోరుకునే వ్యక్తినని అన్నారు. ఏపీ, టీ-టీడీపీ సీనియర్లు తమ స్వార్థం కోసం ఇతర పార్టీల నేతలతో చేతులు కలిపి టీటీడీపీని నాశనం చేస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. తాను కేసీఆర్‌పై పోరాటం చేస్తుంటే ఏపీ, టీ-టీడీపీకీ చెందిన నేతలు ఆయనతో కలిసి సమావేశం నిర్వహించారని, మరికొందరు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో లాలూచీపడి కాంట్రాక్టులు తెచ్చుకున్నారని తెలిపారు. అలాంటప్పుడు తన పోరాటానికి విలువ ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇబ్బందులకు గురిచేసేందుకు, తనను దెబ్బతీసేందుకు కేసీఆర్ టీడీపీ నేతలకు తాయిలాలు ఇస్తున్నారన్నారు.

తాను పార్టీ సంక్షేమం కోరుకునే వ్యక్తినని, తన స్వార్థం కోసం ఎప్పుడూ పార్టీని అడ్డుపెట్టుకోలేదని అన్నారు. టీడీఎల్పీ నేతగా ఉన్నా తనకన్నా సీనియర్ అయిన సండ్రకు అన్ని బాధ్యతలు అప్పగిస్తూ స్పీకర్‌కు గతంలో లేఖ రాశానని, అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు కూడా ఎక్కువ సమయం తమ ఎమ్మెల్యేలకు ఇచ్చానని ఆయన వివరించారు. కేసీఆర్ నియంత పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించాలంటూ, తన పోరాటం ఎప్పుడూ కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌పైనేనని స్పష్టం చేశారు. టీడీపీ కేడర్‌ తనకు ప్రాణ సమానమని, అలాంటి కేడర్‌ను చూస్తే చాలా బాధగా ఉందని అన్నారు. తెలంగాణలో టీడీపీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కొడంగల్‌లో కార్యకర్తలతో చర్చించాకే ఏదైనా నిర్ణయం తీసుకుంటానని రేవంత్‌ చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top