త్వరలో రేవంత్‌ పాదయాత్ర

Revanth reddy padayatra will be soon - Sakshi

కొడంగల్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రాజెక్టులు, ఫ్యాక్టరీ సాధనపై దృష్టి  

సాక్షి, వికారాబాద్‌: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి కొడంగల్‌ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి త్వరలో పాదయాత్ర చేయనున్నారు. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కొడంగల్‌ నుంచి హైదరాబాద్‌కు పది రోజుల పాటు  యాత్ర కొనసాగే అవకాశముంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు.  

పెండింగ్‌లో రైల్వే లైన్‌... 
వికారాబాద్‌–కృష్ణా రైల్వే లైన్‌ కోసం యూపీఏ హయాంలో సర్వే నిర్వహించారు. ఇందుకు రూ.750 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.375 కోట్ల చొప్పున భరించాలి. ఆ తర్వాత వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన వాటాగా నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్రానికి ఫైలును పంపలేదు. దీంతో అది పెండింగ్‌లోనే ఉంది. అది పూర్తయితే వికారాబాద్‌ నుంచి నస్కల్, పరిగి, దోమ, దాదాపూర్, కోస్గి, నారాయణ పేట్, మక్తల్‌ వరకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది.  కొడంగల్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీకి గత ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. నియోజకవర్గంలో సున్నపు నిక్షేపాలు, గనులు అధికంగా ఉన్నాయి. రైల్వే లైన్‌ వేస్తే సిమెంట్‌ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటయ్యే అవకాశముంది.  

ఎత్తిపోతలకు జీవో జారీ చేసినా..  : నారాయణపేట్‌–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం మక్తల్‌ మం డలం భూత్పూర్‌ వద్ద నిర్మించడానికి జీవో 69ను జారీ చేశారు. 8.5 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టు రూ.1,453 కోట్లతో నిర్మించడానికి రిటైర్డ్‌ ఇంజనీర్లు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోయింది.

రోజు 15 కి.మీ. యాత్ర.. 
కొడంగల్‌–హైదరాబాద్‌ మధ్య దూరం 120 కి.మీ.  ఉంటుంది. రోజూ 15 కి.మీ. పాదయాత్ర చేసే అవకాశముంది. కొడంగల్, బొంరాస్‌పేట్, పరిగి, నస్కల్‌ మీదుగా వికారాబాద్‌ చేరుకుంటారు. కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చి మన్నెగూడ, రంగారెడ్డి జిల్లాలోని చిట్టెంపల్లిచౌరస్తా, చేవెళ్ల, మొయినాబాద్‌ మీదుగా హైదరాబాద్‌ చేరుకునే అవకాశముంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top