రేవంత్‌రెడ్డికి నోటీసులు

Revanth Reddy Get Police Notice Over Jubilee Hills Housing Society Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ అక్రమాల కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా జూబ్లీహిల్స్‌ పోలీసులు కాంగ్రెస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డితో పాటు అప్పటి కమిటీలో ఉన్న 13 మందికి బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ సొసైటీ పరిధిలోని ఏడు ఓపెన్‌ప్లాట్ల కబ్జాకు చెందిన రికార్డులు ధ్వంసం అయ్యాయనీ, కోర్టులో స్టే ఎత్తివేశాక కూడా ఇంత వరకు చర్యలు తీసుకోలేదంటూ హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గత జూలై 18న రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును వెలికి తీశారు. ఇందులో భాగంగానే విచారణకు హాజరుకావాలని ఆయనకు 41(ఏ) కింద నోటీసు జారీ చేశారు.

మరోవైపు రికార్డులు ధ్వంసమైన కేసుపై రామారావు హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. దాన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం రెండు వారాల్లో ప్రమాణ పత్రాలను దాఖలు చేయాలని జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆదేశించింది. కాగా ఏడు ప్లాట్లు కబ్జాకు గురైనట్లు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో 2002లో కేసు నమోదైంది. సొసైటీ కార్యవర్గ సభ్యుల్లో ఒకరైన రేవంత్‌రెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి. విచారణ చేపట్టిన అధికారులు ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా ప్లాట్లను విక్రయించారని తేల్చారు. దీనిపై రేవంత్‌రెడ్డితో పాటు కొందరు సభ్యులు కోర్టును ఆశ్రయించారు. 2014 వరకు స్టే ఇచ్చిన హైకోర్టు తర్వాత దాన్ని ఎత్తివేసింది. విచారణను కొనసాగించి బాధ్యులపై చర్యలకు ఆదేశించింది.ఆ తర్వాత అదీ మరుగునపడింది. దీనిపై రామారావు తొలుత నాంపల్లిలోని మూడో అడిషినల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టును , ఆ క్రమంలో తాజాగా హైకోర్టునూ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top