హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపైనే తెలంగాణ భవిష్యత్‌: రేవంత్‌

Revanth Reddy About RTC Strike And Huzurnagar By Election - Sakshi

విలీనం లేదు సరే.. ప్రైవేట్‌పరం అని చెప్పలేదు

ఎర్రబస్‌కు 25శాతం.. ఎయిర్‌ బస్‌కు 1శాతం ట్యాక్సా

మంత్రుల బాధ్యతారహితమైన మాటల వల్లే ఆత్మహత్యలు

సాక్షి, సూర్యాపేట: ఆర్టీసీ సమ్మెతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వివిధ సంఘటనల నేపథ్యంలో భవిష్యత్‌ తెలంగాణ స్వరూపాన్ని నిర్ణయించేది హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికే అన్నారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్‌ నాయకుడు పటేల్‌ రమేష్‌ రెడ్డి నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్‌ రెడ్డి పలు అంశాలపై స్పందిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్‌ రెండో దఫా పాలన పడకేసిందన్నారు రేవంత్‌ రెడ్డి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్‌కు కేసీఆరే కారణమని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో లేదు సరే.. ఆర్టీసీని సగం ప్రైవేట్‌ పరం చేస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు కదా.. మరి మంత్రులు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

ఎర్రబస్సుకు 27శాతం ఇంధన ట్యాక్స్‌ వసూలు చేస్తోన్న కేసీఆర్‌.. ఎయిర్‌ బస్‌కు మాత్రం 1శాతం ట్యాక్స్‌ను మాత్రమే ఎందుకు వసూలు చేస్తున్నాడో చెప్పాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రూ.85 వేల కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులను తన తాబేదార్లకు కట్టబెట్టడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఉద్యోగులను సెల్ఫ్‌ డిస్మిస్‌ అనే అధికారం కేసీఆర్‌కు లేదని స్పష్టం చేశారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని మంత్రుల బాధ్యతారహితమైన మాటల వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. కోర్టులతో ఆటలాడితే.. కేసీఆర్‌కు మొట్టికాయలు తప్పవన్నారు. ఉద్యమ నాయకులేవరు ఆర్టీసీ సమ్మెపై మాట్లాడకపోవడం దారుణమన్నారు రేవంత్‌ రెడ్డి.

మా అక్కను గెలిపించుకుంటాను
కేసీఆర్‌ పాలన రాచరికానికి పరాకాష్టల నిలిచిందన్నారు రేవంత్‌ రెడ్డి. కేసీఆర్‌ నియంతృత్వాన్ని, నిర్భంధాన్ని అణచివేయాలంటే.. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపుని​చ్చారు. భవిష్యత్‌ తెలంగాణ స్వరూపాన్ని నిర్ణయించేది ఈ ఎన్నికలే అని స్పష్టం చేశారు. కేటీఆర్‌ నిజామాబాద్‌లో తన చెల్లిని గెలిపించుకోలేకపోయాడు.. కానీ తాను మాత్రం హుజూర్‌నగర్‌లో తన అ‍క్కను గెలిపించుకుంటానని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కవన్నారు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ అభిప్రాయ బేధాలు ఉండవని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

జగదీశ్‌ రెడ్డి రాజీనామా చేయాలి
కేసీఆర్‌ పాలనలో మద్యం అమ్మకాల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడమే కాక రూ. 2.5లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపారని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. రోడ్డు వెడల్పు కోసం స్వచ్ఛందంగా సహకరించిన వారిని మరో 5 ఫీట్లు వెనక్కి జరగాలంటూ బెదిరించడం అన్యాయమన్నారు. దీన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. పాలన లోపం వల్లే మూసీ గేట్లు దెబ్బతిన్న సంఘటన చోటు చేసుకుందని విమర్శించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ.. మంత్రి జగదీశ్‌ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలోని సాండ్‌ మాఫియా మొదలు.. ల్యాండ్‌ మాఫియా వరకు అన్ని జగదీశ్‌ రెడ్డి కనుసన్నలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. మూసీ నీళ్లు వృథాగా పోవడం వల్ల నష్టపోయిన రైతులకు, మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top