జనసేనకు రావెల కిశోర్‌ రాజీనామా

Ravela Kishore Babu quits Janasena - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దిగులుపడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకొని ముందుకు వెళ్దామంటూ జనసేన పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చిన రెండోరోజే ఆ పార్టీకి షాక్‌ తగలింది. జనసేన పార్టీకి సీనియర్ నేత రావెల కిషోర్‌ బాబు శనివారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాలతో జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు రావెల ఆ లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని పార్టీ చీఫ్‌ను కోరారు. కాగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగిన రావెల కేవలం 26,371 ఓట్లు సంపాదించుకోగలిగారు. ఇక్కడ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మేకతోటి సుచరిత గెలుపొంది, ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కాగా రావెల కిశోర్‌ బాబు కాషాయ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో మంతనాలు జరిపారని, త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. 

మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన రావెల 2014 ఎన్నికల్లో ప్రతిప్తాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొంది, మంత్రివర్గంలో చోటు దక్కించుకుని, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అయితే పార్టీలో అంతర్గత విబేధాలు, వివాదాలతో పాటు కేబినెట్‌ విస్తరణ సందర్భంగా ఆయన మంత్రి పదవి కోల్పోయారు. ఆ తర్వాత నుంచి టీడీపీకి దూరంగా ఉన్న ఆయన...ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు సీటుతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top