ఎన్డీయేలో చేరండి: జేడీఎస్‌కు ఆహ్వానం

Ramdas Athawale Invitation To Kumaraswamy To Join The NDA - Sakshi

ఎన్డీయేలోకి ఆహ్వానించిన కేంద్రమంత్రి రాందాస్‌ అంథవాలే

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఏ క్షణానా ఏ ఎమ్మెల్యే గోడుదూకుతారోనని ఇటు జేడీఎస్‌ అటు కాంగ్రెస్‌ నేతల్లో భయాందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రాందాస్‌ అథవాలే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శనివారం ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. జేడీఎస్‌ను ఎన్డీయే కూటమిలో చేరవల్సిందిగా ఆహ్వానించారు.

‘‘ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న కుమారస్వామి ప్రభుత్వాన్ని ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్‌కి కటీఫ్‌ చెప్పి మాతో కలిస్తే డిప్యూటీ సీఎం పదవిని ఇస్తాం. కుమారస్వామి ప్రభుత్వం దినదిన గండంగా గడుస్తోంది. మాతో కలిస్తే జేడీఎస్‌కు మంచి భవిష్యత్‌ ఉంటుంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్‌ నేతలే కుట్రపన్నుతున్నారు. ప్రజలకు మంచి చేయాలని కుమారస్వామికి ఉన్నా..  దానికి కాంగ్రెస్‌ అడ్డుపడుతోంది. ఆయన సీఎం అయినప్పటి నుంచి బహిరంగ సభల్లోనే అనేక సార్లు కన్నీరుపెట్టుకున్నారు. కాంగ్రెస్‌ నేతలు తీవ్ర వేదనకు గురిచేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

తూమకూరు మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమి కూడా స్థానిక హస్తం నేతలే అని రాందాస్‌ అథవాలే ఆరోపించారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 20 చోట్ల, జేడీఎస్‌ మిగిలిన 8 స్థానాల్లో పోటీచేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీల మధ్య సహకారం, ఓట్ల బదిలీ అనుకున్నంతగా జరగలేదు. మాజీ సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతలు, కుమారస్వామి నేతృత్వంలోని ఒకరిని మరొకరు విశ్వాసంలోకి తీసుకోలేదు. దీంతో చాలా చోట్ల క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ అన్నది సాఫీగా జరగలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితితో తమ భవిష్యత్‌ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకునేందుకు ఇటు కుమారస్వామి, అటు సిద్దరామయ్య పార్టీ నేతలతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాందాస్‌ అథవాలే వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయం మరింత వేడెక్కనుంది. దీనిపై జేడీఎస్‌ నేతలు ఇప్పటివరకు స్పందించలేదు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top