
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై దక్షిణాది సూపర్ స్టార్, రజనీ మక్కల్ మండ్రం అధినేత రజనీకాంత్ స్పష్టత ఇచ్చారు.
సాక్షి, చెన్నై : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై దక్షిణాది సూపర్ స్టార్, రజనీ మక్కల్ మండ్రం అధినేత రజనీకాంత్ స్పష్టత ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు ఆయన ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. చెన్నైలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ... తమ టార్గెట్ 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలేనని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము పోటీ చేయమని, అలాగే ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల్లో ఎవరైనా తమ ఫోటోగానీ, పార్టీ గుర్తు కానీ వాడరాదని సూచించారు. ఒకవేళ అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రజనీకాంత్ హెచ్చరించారు. తమిళనాట నెలకొన్న ప్రధానమైన నీటి సమస్యను తీరుస్తారనే నమ్మకం ఉన్నవారికే ఓటు వేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.