ఎవరు పదిలం?

Rahul Gandhi vs Narendra Modi in 2019 Elections - Sakshi

ఓట్ల పండుగ రానే వచ్చింది..ఓటరు దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు నాయక గణం.. మాటల మూటలు సిద్ధంచేసుకుంటుంటే.. ఐదేళ్ల పాలన సమీక్షకు, తప్పొప్పులలెక్కలకు సామాన్యుడూ రెడీ అవుతున్నాడు. దాయాది పాక్‌పై చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఓట్లు, సీట్లు తెచ్చిపెడతాయా...? చేసినవాగ్దానాలు నెరవేర్చలేదన్న అసంతృప్తి ఓటరులో ఎంతుంది? ఐదేళ్ల పాలన చివరి ఏడాదిలో రైతులపై కురిపించిన వరాల జల్లు ప్రభావం ఎంత? యువ ఓటర్‌ రూట్‌ ఎటు? ఎఫ్‌బీ, ట్విట్టర్‌ పక్షులైన నగర ప్రజల మది మెప్పించేదెవరు? తదితర పది అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. అవేమింటే..

బ్యాలెట్‌పై సర్జికల్‌ స్ట్రయిక్‌..
దశాబ్దాలుగా రగులుతున్న కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వాల కంటే భిన్నమైన మార్గం ఎంచుకున్న ఘనత మోదీదనడంలో సందేహం లేదు. చెప్పా పెట్టకుండా పొరుగుదేశంలో వాలిపోయి తేనీటి ఆతిథ్యం స్వీకరించడంతో మొదలైన మోదీ మార్కు దౌత్యం.. ఆఖరకు పుల్వామా ప్రతీకార దాడుల దశకు వచ్చేసింది. రెండేళ్ల క్రితం యూరి ఉగ్రవాద దాడికి ప్రతిగా చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ దేశవ్యాప్తంగా ఓ సంచలనం. 1990 ఎన్నికల కాలం నుంచి ఎన్నికల ముందు ఇరుదేశాల మధ్య కవ్వింపు చర్యలు.. కార్గిల్‌ లాంటి పరిమిత యుద్ధాలు కొత్త కాకపోయినా.. సరిహద్దులు దాటుకుని లోనికి చొచ్చుకుపోయి మరీ చేసిన బాలాకోట్‌ దాడులు సామాన్యుడికి ఒకింత ధైర్యం ఇచ్చాయనే చెప్పాలి. భద్రతా వైఫల్యమన్న ప్రతిపక్షాల మాటలను ఓటు వేసే సామాన్యుడు పట్టించుకునేది కొంతే. ఇటీవల జరిగిన కొన్ని సర్వేల్లోనూ బాలాకోట్‌ దాడులను దేశ రక్షణకు తీసుకున్న మేటి చర్యగా అభివర్ణించడం.. బీజేపీకి శుభసూచకమే. దృఢ, కఠిన నిర్ణయాలు తీసుకో గలిగిన నేత కావాలనుకునే వారు మోడీ వైపు మొగ్గుచూపితే.. శాంతి సామరస్యాలు కోరేవారు మరోలా ఆలోచించే అవకాశం ఉంది.

పట్టాలెక్కని ఘట్‌బంధన్‌..
ఐదేళ్ల సుస్థిర ప్రభుత్వాన్ని అందించిన మోదీ ఇంకోసారి గద్దెనెక్కాలంటే... ఎన్డీయే కంటే ప్రత్యర్థి పార్టీల పొత్తులపై ఒక కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటారా? చాలా సింపుల్‌. గత ఎన్నికల్లో 282 సీట్లు సాధించిన బీజేపీ ఓట్ల శాతం కొంచెం అటుఇటుగా 31 శాతం మాత్రమే. కాంగ్రెస్‌తోపాటు అనేక ప్రాంతీయ పార్టీలు సొంతబలంతోనే పోటీ చేశాయి. ఫలితంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు చెల్లా చెదురయ్యాయి. ఇది అర్థం చేసుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఎక్కడికక్కడ పొత్తులతో మోదీని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. యూపీలో బువా– భతీజా పేరుతో బీఎస్పీ, ఎస్పీలు జట్టు కట్టినా... పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్‌తో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతుండటం, తమిళనాడులో యూపీఏ భాగస్వామి డీఎంకే, కర్ణాటకలో జేడీ(ఎస్‌)తో దోస్తీలు ఇందుకోసమే అన్నది సుస్పష్టం. అయితే బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒక ఛత్రం కిందకు తెచ్చేందుకు కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నాలు అంతగా విజయవంతం కాలేదు. ఫలితంగా ఈ పొత్తుల వల్ల కాంగ్రెస్‌కు లాభించేది తక్కువే. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌కు మజ్లిస్‌తోపాటు మరికొన్ని పార్టీలు తోడైతే పరిస్థితి జటిలంగా మారుతుంది.

‘సోషల్‌’ యుద్ధాలు...
ఒకప్పుడు ఎన్నికలంటే మైకులు, లౌడ్‌స్పీకర్లు... ర్యాలీలు, సభలు,సమావేశాలు!! ఊరొక్కటే కాదు.. దేశమంతా సందడే సందడి.. ఎన్నికల నియమావళి అనండి.. ఓటరు చైతన్యం అనండి.. ఇంకేదైనా చెప్పండిగానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లే వేదికగా ప్రచారం హోరెత్తుతోంది. ఈ అస్త్రాలన్నింటినీ ఎన్నికల రణరంగానికి పరిచయం చేసిన ఘనత బీజేపీదే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రచారానికి మాత్రమే కాకుండా పార్టీ బలోపేతానికి.. ప్రజలతో మమేకమయ్యేందుకూ వాడుకుని బీజేపీ లబ్ధి పొందగా.. ఈ సారి పరిస్థితి భిన్నమైపోయింది. జాతీయపార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ చూపిన మార్గంలోనే సోషల్‌ బాట పట్టేయడం.. తమ వాదనను వినిపిస్తూనే ప్రత్యర్థులపై విమర్శలు సంధించడం మొదలుపెట్టేశాయి. తప్పుడు వార్తలు  ఓటరును ముంచెత్తేశాయి కూడా. అయితే అమెరికా ఎన్నికల్లో చెలరేగిన వివాదాలను దృష్టిలో ఉంచుకుని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు మన ఎన్నికల్లో కొన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఫేక్‌ న్యూస్‌తోపాటు అభ్యంతకరమైన పోస్టులను తొలగించేందుకు, నియంత్రించేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌తోపాటు ఇతర ప్లాట్‌ఫాంలు కూడా ప్రత్యేక అధికారులను నియమించడం, ప్రభుత్వంతో సహకరించేందుకు అంగీకరించడంతో ఈ సారి సోషల్‌ మీడియా వార్‌ కాస్తాఆసక్తికరంగా మారింది!!

ఆ గట్టునుంటావా..ఈ గట్టునుంటావా?
గత ఐదేళ్లలో దేశం వర్గాలుగా చీలిపోయాయి అని కొంతమందిఅంటూ ఉంటారు. ప్రభుత్వం పనితీరును ప్రశ్నిస్తున్న వారిని అర్బన్‌ నక్సలైట్లు.. సిక్యులరిస్ట్‌లు, దేశద్రోహుల్లాంటిబోలెడన్ని పేర్లు పెట్టి ఎద్దేవా చేయడంతోమొదలైన ఈ వర్గీకరణ ఎన్నికలసమయానికి పూర్తిస్థాయికి చేరుకుంది. గత ఎన్నికల సమయానికి ఈ పద్ధతిబీజేపీకి అనుకూలంగానూ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానూ పనిచేసింది కూడా.పాకిస్తాన్, జమ్మూ కశ్మీర్‌ల పేరిటకొన్ని చోట్ల దేశభక్తిని ప్రేరేపించడం.. ఆవుల సంరక్షణ పేరుతో సమాజంలోని కొన్ని వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం ఆయా వర్గాల వారు మోదీకి దూరమయ్యేందుకు
కారణాలవుతున్నాయి. ఈ లోటును అధిగమించే ఉద్దేశంతోనే పదవీకాలం చివరిదశలో మోదీ సర్కారు బాలాకోట్‌ దాడులను వాడుకుంటుందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే మైనార్టీ ఓటర్లు  వ్యతిరేకంగా పడితే ఎన్డీయేకు సమస్యలు తప్పవన్నది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అంచనా.

నోట్ల రద్దు.. ఓట్ల పద్దు!
పెద్దనోట్ల రద్దు... దేశమంతటా ఏకరీతి పన్నులు.. ఐదేళ్ల మోదీ పాలనలో తీసుకున్న  కీలకమైన ఆర్థిక విధాన నిర్ణయాలు. గత ఎన్నికల్లో ద్రవ్యోల్బణ ప్రభావంతో నిత్యావసరాల ధరలు కొండెక్కడం అతిపెద్ద ఎన్నికల అంశంగా మారితే... ఈసారి ఎన్నికల్లో దీని ప్రస్తావన కూడా వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం నెగటివ్‌ స్థాయికి పడిపోవడం ఇందుకు కారణం. అయితే వ్యవసాయ ఉత్పత్తుల ధరలను అణగదొక్కడం ద్వారా సాధించిన ఈ నెగటివ్‌ ద్రవ్యోల్బణం గాలిబుడగ చందమన్నది ప్రత్యర్థుల వాదన. నగరాల్లో ధరలు పెద్దగా పెరగకపోవడం గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన అసంతృప్తికి కారణమైందని... దీని ప్రభావం బీజేపీపై ఉంటుందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. పేదరిక నిర్మూలనకు దేశం కనీసం ఏడు శాతం వృద్ధి రేటు సాధించాలన్నది నిపుణుల అభిప్రాయం. అయితే.. పెద్దనోట్ల రద్దు... జీఎస్‌టీ అమల్లో ఒడిదుడుకుల కారణంగా వృద్ధి రేటు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఆర్థిక వృద్ధి సూచీల లెక్కల్లో తరచూ జరిగిన మార్పులు ప్రభుత్వ విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తించాయి. ఇదే సమయంలో విదేశీ పెట్టుబడులు ఆశించినంత రాకపోవడం.. వ్యవసాయ, తయారీ రంగం మందగతిలో సాగుతూండటం కూడా ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి.

మోదీ వర్సెస్‌ రాహుల్‌గాంధీ...
గత ఎన్నికల్లో దేశం మొత్తం మోదీ హవాపై నడిచిపోతే.. ఈసారి మాత్రం పరిస్థితుల్లో కొంత మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగానూ ఎన్నికలు ఎదుర్కోబోతున్న రాహుల్‌ గాంధీలో రాజకీయంగా వచ్చిన పరిణతి ఇందుకు కారణం. సోషల్‌మీడియాలో పప్పుగా అందరినోళ్లల్లోనూ నానిన రాహుల్‌... ఆ బరువును దించేసుకుని సరికొత్త అవతారమెత్తేందుకు కొంత సమయం పట్టినా... ఆ తరువాతి కాలంలో వేర్వేరు అంశాలను లేవనెత్తే విషయంతోపాటు పదునైన విమర్శలు సంధించడంలోనూ చురుకుగా ఉన్నాడని పరిశీలకులే అంటున్నారు. కాపలాదారుడినన్న మోదీ వ్యాఖ్యను కాపలాదారుడే దొంగ (చౌకీదార్‌ చోర్‌ హై) అని తిప్పి కొట్టడం.. జీఎస్‌టీని గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌గా అభివర్ణించడం... రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వివాదాన్ని భిన్న కోణాల్లో ప్రజల్లో చర్చకు ఉంచడం రాహుల్‌ పప్పు కాదనేందుకు తాజా ఉదాహరణలన్నది వీరి అంచనా. మరి ఇవన్నీ కాంగ్రెస్‌కు లాభిస్తాయా? అంటే వేచిచూడాల్సిందేనన్న సమాధానం వీరి నుంచి వస్తోంది. ఎందుకంటే అమిత్‌ షా వ్యూహ చతురత, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితరరాలు బీజేపీకి మేలు చేయవచ్చునని అంటున్నారు.

తిరగబడిన రైతన్న
లక్షల మంది రైతులు కాలికి చెప్పుల్లేకుండా ముంబై వీధుల్లో నిరసన గళం ఎత్తడం.. ప్రధాని నరేంద్రమోదీ ఇంటికి దగ్గర్లోని జంతర్‌ మంతర్‌ వద్ద నెలల తరబడి... రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేయడం.. మధ్యప్రదేశ్‌లోని మాండోసర్‌లో గిట్టుబాటు ధరల కోసం ఉద్యమించిన రైతులపై కాల్పులు... ఈ ఐదేళ్లలో రైతుల ధర్మాగ్రహానికి కొన్ని మచ్చుతునకలు. మునుపెన్నడూ లేనంతగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్న ఆర్థికవేత్తల అంచనాలు ఎన్నికల్లో ఏ రకమైన ప్రభావం చూపనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. 2016 నాటి పెద్దనోట్ల రద్దు ప్రభావంతో రైతు కూలీలు ఉపాధి కోల్పోయారన్న అంచనాలు అప్పట్లో చాలానే వచ్చాయి. పంటకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయడంలో జాప్యం జరగడం.. ఆ తరువాత కొన్ని మార్పులు చేర్పులతో వాటిని అమల్లోకి తేవడం రైతును ఏ మాత్రం సంతృప్తి పరచలేకపోయాయి. వ్యవసాయ రంగంలో పెట్టుబడుల మాట సరేసరి! గత నవంబరు, డిసెంబరులలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చేందుకు కూడా గ్రామీణ ఓటర్ల అసంతృప్తి కారణమని విశ్లేషకుల అంచనా. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే మోదీ సర్కారు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోనూ పెట్టుబడి సాయంతో రైతుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేసిందని అంచనా. ఈ చర్యలతో రైతు శాంతిస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరం. 2009నాటితో పోలిస్తే బీజేపీ గ్రామీణ ప్రాంత ఓట్ల శాతం 21 నుంచి 30కు చేరుకోగా.. అత్యధిక ఓట్లు, సీట్లు గెలిచింది మాత్రం నగర, పట్టణ ప్రాంతాల్లోనే కావడం ప్రస్తావించాల్సిన అంశం.

ఉద్యోగాలెక్కడ?
ఏటా రెండు కోట్ల కొత్త ఉద్యోగాలన్న నినాదంతో 2014 ఎన్నికల బరిలోకి దిగిన ఎన్డీయే ఈ ఐదేళ్ల కాలంలో ఆ వాగ్దానాన్ని ఎంతమేరకు నిలబెట్టుకుందన్న విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వ అంచనాల మేరకు కూడా నిరుద్యోగిత ఐదేళ్లలో గరిష్టస్థాయికి చేరడం కమలనాథులకు కొంత ఆందోళన కలిగించే అంశమే. పెద్దనోట్ల రద్దుతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కుదేలైపోయాయని, కోట్ల మంది చిరు ఉద్యోగులు ఉపాధి కోల్పోయారన్న ప్రతిపక్షాల విమర్శలను పాలకపక్షం ఒకదశలో ఎద్దేవా చేసింది కూడా. పకోడీలు అమ్ముకోవడమూ ఒక ఉద్యోగమే అని అమిత్‌ షా లాంటి వారు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ప్రభుత్వం సమస్య తీవ్రతను అర్థం చేసుకోకుండా సమాచారాన్ని వక్రీకరించి తనకు అనుకూలంగా మార్చుకుందన్న ఆరోపణలూ వచ్చాయి. ఉద్యోగాల సంఖ్య పెరిగిందనేందుకు నిదర్శనంగా ప్రభుత్వం పీఎఫ్‌ ఖాతాదారుల సంఖ్య పెరగడాన్ని, ముద్ర రుణాలను చూపితే.. ఇవేవీ వాస్తవ పరిస్థితికి అద్దం పట్టవని ప్రతిపక్షం పెదవి విరిచేసింది. ఇండియా టుడే ఇటీవల నిర్వహించిన ఒక సర్వే కూడా ఈ ఎన్నికల్లో ఉద్యోగాల కల్పన అన్నది అతిపెద్ద అంశంగా నిలుస్తుందని తేల్చడం గమనార్హం. భారతీయ రైల్వే గత ఏడాది 63 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తే.. ఏకంగా కోటీ 90 లక్షల మంది దరఖాస్తు చేయడం మహారాష్ట్రలో ఐదంటే ఐదు ఆఫీస్‌ బాయ్‌ ఉద్యోగాలకు 23 వేల మంది పట్టభద్రులు, ఇంజనీరింగ్‌ చదివిన వారు దరఖాస్తు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఏటా దాదాపు పది లక్షల మంది చదువులు ముగించుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా.. అదేస్థాయిలో ఉద్యోగాలు లేవన్నది మాత్రం నిష్టూర సత్యం. మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియాలు కూడా తగినన్ని ఉద్యోగాలు కల్పించలేకపోయాయని.. ఈ పరిస్థితి జాతీయ విపత్తుకు ఏమాత్రం తక్కువ కాదని ప్రతిపక్ష కాంగ్రెస్‌ మండిపడుతోంది. ఈ అంశాలన్నీ ఈసారి ఓటు వేసే యువతీయువకులపై  కచ్చితంగా ప్రభావం చూపుతాయని నమ్ముతోంది.

దళితులు.. గిరిజనులు...
కొన్నేళ్ల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ గ్రామం పతాకశీర్షికలకు ఎక్కింది. గో సంరక్షణ పేరుతో కొంతమంది దళితులపై దాడిచేయడంతో వివాదం మొదలైంది. ఈ సంఘటనను నిరసిస్తూ గుజరాత్‌లో జిగ్నేష్‌ మెవానీ లాంటి వారు భారీ ర్యాలీలు నిర్వహించడం.. జంతు కళేబరాలను తొలగించే పనిని బహిష్కరించాలన్న మెవానీ పిలుపునకు మంచి స్పందన రావడం మోదీ ప్రభుత్వానికి.. దళితులకు మధ్య అంతరం పెరుగుతోందనేందుకు నిదర్శనంగా మారింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రోహిత్‌ వేముల ఆత్మహత్య.. అతడి కులంపై వివాదాలు కూడా ఎన్డీయే సర్కారుకు ప్రయోజనమైతే కలిగించలేదు. తరువాతి కాలంలోనూ అనేక అంశాలు బీజేపీ అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తుందనే భావనను కల్పించాయని.. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల పదును తగ్గించడం లాంటివి ఇందుకు ఉదాహరణ అని విశ్లేషకులు చెబుతారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమ్‌ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు గిరిజనులను బీజేíపీకి దగ్గర చేసే ప్రయత్నం చేసింది. కానీ గిరిజనులు ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓటమిపాలవడం, భూ యాజమాన్య హక్కుల చట్టంలో మార్పుల ద్వారా జార్ఖండ్‌లోనూ గిరిజనులు అసంతృప్తికి గురికావడం బీజేపీకి పడే ఈ వర్గాల ఓట్లపై ప్రభావం చూపనున్నాయని అంచనా వేస్తున్నారు.  అడవుల్లో నివసిస్తున్న దాదాపు పదిలక్షల కుటుంబాలను అక్కడి నుంచి తరలించాలన్న సుప్రీంకోర్టు తాజా ఉత్త్తర్వు బీజేపీకి గోరుచుట్టుపై రోకటిపోటు అన్నచందంగా మారిపోయింది.  

ఆమె.. ఎటువైపు?
గత ఐదేళ్లలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. ముఖ్యంగా మహిళా రైతులు, కూలీలు నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. పల్లెల్లో బిందెడు నీళ్ల కోసం మైళ్లకి మైళ్లు నడిచే పరిస్థితులు తొలగిపోలేదు. ఇక మహిళలపై నేరాలు ఘోరాల సంగతి చెప్పక్కర్లేదు. భారత్‌లో మహిళలకు భద్రత కరువైందని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మహిళల్లో ఓటు హక్కుపై చైతన్యం బాగా పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో  వారి ఓటింగ్‌ శాతం పురుషుల కంటే అధికంగా ఉంది. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి  ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పడావో, మహిళలకు ఉచితంగా గ్యాస్‌ స్టౌలు పంపిణీ చేసే ఉజ్వల్‌ పథకం, స్వచ్ఛభారత్‌లో భాగంగా మరుగుదొడ్లు కట్టి ఇవ్వడం వంటి చర్యలు చేపట్టింది. కానీ మహిళా రిజర్వేషన్‌ బిల్లును మాత్రం ఇంకా త్రిశంకు స్వర్గంలోనే ఉంచింది. మరి 43 కోట్ల మంది మహిళా ఓటర్లు ఈసారి ఎవరి వైపు ఉంటారు? ఇప్పుడిదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top