వారు కోరితే ప్రధానినవుతా

Rahul Gandhi says Will become PM if allies want me to - Sakshi

కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఒకవేళ మిత్రపక్షాలు కోరుకుంటే తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతానని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలిపారు. అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ తొలి ప్రాధాన్యమని వెల్లడించారు. ఎన్నికలు పూర్తయ్యాక అన్ని పక్షాలతో కలిసి చర్చించి ప్రధాని అభ్యర్థిపై తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన హిందుస్తాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌–2018(హెచ్‌టీఎల్‌ఎస్‌)లో ప్రసంగించిన రాహుల్‌ పలువురు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు.

‘తొలుత కలిసికట్టుగా పోటీచేసి బీజేపీని ఓడించాలనీ, అనంతరం అందరూ కూర్చుని చర్చించి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలని మేం(ప్రతిపక్షాలు) నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ మా మిత్రపక్షాలు కోరుకుంటే నేను ప్రధానిగా బాధ్యతలు తప్పకుండా చేపడతా. మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీచేసేందుకు బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) నిరాకరించడంతో మాకు వచ్చిన నష్టమేమీ లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి విపక్షాలన్నీ ఏకమవుతాయి.

మా అమ్మ సోనియాగాంధీ నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఓపిక తక్కువగా ఉండే నాకు ప్రశాంతంగా ఎలా ఉండాలో అమ్మ నేర్పించింది. కొన్నిసార్లు ‘అమ్మ నీకు ఓపిక మరీ ఎక్కువైంది’ అని నేను చెబుతుంటా’’ అని రాహుల్‌ చమత్కరించారు. మీ జీవితంలో ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారా? అన్న ప్రశ్నకు.. ‘ఎందుకులేరూ.. మా అమ్మ, సోదరి సహా నా జీవితంలో చాలామంది ఉన్నారు‘ అని రాహుల్‌ నవ్వుతూ జవాబిచ్చారు. సామాన్యులపై పెట్రో భారాన్ని తగ్గించేందుకు వీలుగా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకురావాలని రాహుల్‌ ప్రధాని మోదీని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top