పిట్రోడా బహిరంగ క్షమాపణ చెప్పాలి

Rahul Gandhi hits out at Sam Pitroda for remarks on 1984 riots - Sakshi

సిక్కుల ఊచకోత వ్యాఖ్యలను మరోసారి ఖండించిన రాహుల్‌

ఖన్నా(పంజాబ్‌): 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు తమ పార్టీ నేత అయిన శ్యామ్‌ పిట్రోడా సిగ్గుపడాలని, దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ పేర్కొన్నారు. సోమవారం పంజాబ్‌లోని ఖన్నాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్‌ మాట్లాడారు. ‘పిట్రోడా జీ, మీరలా అనడం పూర్తిగా తప్పు. అందుకు మీరు సిగ్గుపడాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయనకు ఫోన్‌లో చెప్పా. అదే విషయాన్ని ఇప్పుడు బహిరంగంగా మీకు వెల్లడిస్తున్నా’ అని రాహుల్‌ అన్నారు.  బీజేపీ ప్రభుత్వ హయాంలో నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా ప్రజల కొనుగోలు శక్తిని పూర్తిగా హరించి వేశాయని, లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు.  యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, రైతులకు మద్దతు ధర, ప్రతి బ్యాంకు అకౌంట్‌లో రూ.15 లక్షల జమ వంటి గత ఎన్నికల హామీలను బీజేపీ విస్మరించిందని మండిపడ్డారు.

బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్‌ విసిరారు. రఫేల్‌ ఒప్పందంపై 15 నిమిషాల బహిరంగ చర్చకు వచ్చేందుకు కూడా ఆయన భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రధాని మోదీ విమర్శించడం అంటే దేశ ప్రజలను విమర్శించడమేనని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పేదల కోసం న్యాయ్‌ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకం కింద పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.72 వేలు చొప్పున జమ కావడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. 1984లో దేశరాజధానిలో సిక్కుల ఊచకోతపై కాంగ్రెస్‌ ఓవర్సీస్‌ విభాగం చీఫ్‌ శ్యామ్‌ పిట్రోడా ‘జరిగిందేదో జరిగిపోయింది’ అంటూ మాట్లాడటంపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో చేసిన ఇలాంటి వ్యాఖ్యలను ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తుండటంతో నష్ట నివారణకు రాహుల్‌ ప్రయత్నిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top