హార్థిక్‌ పటేల్‌ సీక్రెట్‌ భేటీ.. గుజరాత్ కుతకుత‌! | Rahul Gandhi, Hardik Patel secretly met in Gujarat | Sakshi
Sakshi News home page

హార్థిక్‌ పటేల్‌ సీక్రెట్‌ భేటీ.. గుజరాత్ కుతకుత‌!

Oct 24 2017 11:46 AM | Updated on Aug 21 2018 2:39 PM

 Rahul Gandhi, Hardik Patel secretly met in Gujarat - Sakshi

రహస్య సమావేశాలు.. చీకటి ఒప్పందాలు.. జంప్‌ జిలానీలు.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్‌ను ఇప్పుడివే కుదిపేస్తున్నాయి. రహస్య సమావేశాలు.. చీకటి ఒప్పందాల గురించి గుజరాత్‌లో సంచలన కథనాలు వెలుగుచూస్తున్నాయి.

పటేళ్లకు రిజర్వేషన్‌ కోసం తన ఉద్యమంతో రాష్ట్రాన్ని కుదిపేసిన హార్థిక్‌ పటేల్‌ రహస్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారట. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ వీడియో దృశ్యాలు అంటూ సోమవారం సాయంత్రం కొన్ని మీడియా చానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. అహ్మదాబాద్‌లోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో రాహుల్‌-హర్థిక్‌ భేటీ అయ్యారని, హోటల్‌లోని ఓ గదిలోకి హార్థిక్‌ వెళుతున్న దృశ్యాలను ఆ చానెళ్లు ప్రసారం చేశాయి. ఆ గదిలో రాహుల్‌ ఉన్నారని, వీరు సుదీర్ఘంగా చర్చించుకున్నారని పేర్కొన్నాయి. అయితే, ఈ కథనాలను హార్థిక్‌ పటేల్‌ అనుచరులు తోసిపుచ్చారు. ఆ హోటల్‌కు హార్థిక్‌ వెళ్లిన విషయం వాస్తవమేనని, కానీ ఆయన రాహుల్‌ను కలువలేదని తెలిపారు. హార్థిక్‌ రాహుల్‌ను కలువలేదని, కాంగ్రెస్‌ నేతలు మకాం వేసిన హోటల్‌పై గుజరాత్‌ పోలీసులు నిఘా పెట్టారని, పరారీ నేరస్తుల్లా తమ కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని గుజరాత్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. హోటల్‌ సీసీటీవీ దృశ్యాలను పోలీసులు తీసుకొని.. మీడియాకు ఇచ్చారని ఆరోపించారు. హోటల్‌ సైతం పోలీసులకు ఈ సీసీటీవీ దృశ్యాలను ఇచ్చినట్టు అంగీకరించింది. బీజేపీ మాత్రం రాహుల్‌తో రహస్యంగా భేటీ కావాల్సిన అవసరం హార్థిక్‌కు ఏముందని ప్రశ్నిస్తోంది.

అది హార్థిక్‌ వ్యూహమే..!
తాజాగా బీజేపీలో చేరిన పటేల్‌ ఉద్యమం రాష్ట్ర కన్వీనర్‌ నరేంద్ర పటేల్‌.. అనూహ్యంగా కమలం పార్టీకి ఎదురుతిరిగిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరిన రెండుగంటల్లోపే నరేంద్ర పటేల్‌ మీడియా సమావేశం పెట్టి మాట మార్చారు. తను బీజేపీలోకి వచ్చేందుకు కోటిరూపాయలు ఇవ్వజూపారని ఆరోపించారు. తొలివిడతగా రూ.10లక్షలు ఇచ్చారని సమావేశంలో ఆ డబ్బును చూపించారు. పటేల్‌ ఆందోళనలో కీలకంగా వ్యవహరించిన  వరుణ్‌ పటేల్, రేష్మా పటేల్‌లు బీజేపీలోకి వస్తే కోటి రూపాయలు ఇస్తామన్నారని నరేంద్ర ఆరోపించారు. ఇలా ప్లేటు ఫిరాయించిన నరేంద్ర పటేల్‌ వెనుక హార్థిక్‌ పటేల్‌ ఉన్నారని, ఆయన వ్యూహంలో భాగంగానే కమలం పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు.. పార్టీలో చేరినట్టు చేరి.. చివరకు హ్యాండ్‌ ఇచ్చాని కథనాలు వస్తున్నాయి. ఈ వ్యవహారం గుజరాత్‌లో పెద్ద దుమారం రేపుతోంది. ఇదంతా కాంగ్రెస్‌ ఆడుతున్న నాటకంలో భాగమని బీజేపీ విమర్శిస్తోంది. నరేంద్ర పటేల్‌ ఆరోపణలపై న్యాయవిచారణ జరపాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ‘పటీదార్‌ నేతలకు బీజేపీ లంచం ఇవ్వటం.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఈ ఆరోపణలు తీవ్రమైనవి. ఈ కేసులో గుజరాత్‌ బీజేపీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. గుజరాత్‌ హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి’ అని కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ డిమాండ్‌ చేశారు.

పటీదార్ల ఉద్యమానికి నేతృత్వం వహించిన హార్థిక్‌ పటేల్‌ ఇటు బీజేపీకిగానీ, అటు కాంగ్రెస్‌ పార్టీకిగానీ బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. ఎన్నికల్లో పటీదార్‌ వర్గం ఓటర్లు కీలకం కావడంతో ప్రస్తుతం హార్థిక్‌ పటేల్‌, పటేల్‌ ఓటుబ్యాంక్‌ చుట్టూ గుజరాత్‌ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement