‘టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటికైనా మారాలి’

Ponnam Prabhakar Slams TRS on High Court Verdict - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల శాసన సభ్యత్వాల రద్దు చెల్లదని మంగళవారం హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. గాంధీ భవన్‌లో పొన్నం బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పుని స్వాగతించకుంటే ప్రజల్లో టీఆర్‌ఎస్‌ మరింత చులకన అవుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం ఏ మేరకు వచ్చిందో తెలియదుగానీ.. 9 ఎకరాల్లో ప్రగతి భవన్‌ మాత్రం అద్భుతంగా కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఆర్థిక క్రమశిక్షణ లేదని ప్రభుత్వానికి కాగ్‌ అక్షింతలు వేసినా ఇంకా పాలనలో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు. అడ్డగోలు అప్పుల కారణంగా పుట్టబోయే ప్రతిబిడ్డ లక్ష రూపాయల అప్పు తీర్చాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

‘తుమ్మినా, దగ్గినా టీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం యాత్ర అంటున్నారు. పెద్దవాళ్లతో పొగిడించుకుంటున్నారు. మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు.. ఇవన్నీ ఎవరు కట్టారు. మేం కట్టిన ప్రాజెక్టులకు సైతం టీఆర్‌ఎస్‌ పేరు పొందాలని చూస్తోంది. విగ్గు పెట్టి వెంట్రుకలు మొలిచాయంటున్నార’ని పొన్నం ప్రభాకర్ టీఆర్‌ఎస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు తర్వాత కూడా ఇంకా పెద్ద లాయర్లతో కేసును ముందుకు తీసుకెళ్తామని.. సుప్రీం కోర్టుకు వెళ్తామని టీఆర్‌ఎస్‌ భావించడంలో అర్థమే లేదంటూ ధ్వజమెత్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top