తుగ్గలిలో వైఎస్ విగ్రహం వద్ద అశేష జనవాహినికి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు ప్రతి నెలా రూ.3 వేలు పింఛన్ అందజేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఒకే ఇంట్లో ఉండే వృద్ధ దంపతులు ఇద్దరికీ పింఛను సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో శనివారం 24వ రోజు ప్రజా సంకల్ప యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా దారిపొడవునా రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజాసంఘాల నేతలు వైఎస్ జగన్‌కు తమ సమస్యలు విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా ‘అయ్యా.. మా కుమారుడు రాజేష్ మానసిక వికలాంగుడు. వంద శాతం వైకల్యమున్నా పింఛన్ ఇవ్వడం లేదు..’అంటూ వెంకటప్ప, వరలక్ష్మి దంపతులు తుగ్గలి మండలం రాతన గ్రామం వద్ద జననేతతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తాను కాలు పోగొట్టుకున్నానని, వికలాంగ పింఛన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని అదే గ్రామానికి చెందిన చిన్న మునెయ్య వాపోయాడు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం తమకు వికలాంగ పింఛన్ ఇవ్వడం లేదని పలువురు దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. వారందరి సమస్యలను ఓపికగా విన్న ప్రతిపక్ష నేత.. ఎవరూ అధైర్యపడొద్దని, ఏడాది ఓపిక పడితే మనందరి ప్రభుత్వం రాగానే దివ్యాంగులకు మూడు వేల రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పారు.
పింఛను డబ్బులు సరిపోవడం లేదు..
పత్తికొండకు చెందిన సంజన్న అనే వృద్ధుడు జగన్‌ను కలిసి తన సమస్య చెప్పుకుని బాధపడ్డాడు. ‘సార్.. నా భార్యకు పింఛను వస్తోంది. కానీ ఆ డబ్బులు ఆమె మందులకు కూడా సరిపోవడం లేదు. ఉన్న రెండు ఎకరాల పొలం కుమారులు తీసుకున్నారు. మేమిద్దరం పింఛన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. ఇంట్లో ఇద్దరికీ పింఛను ఇస్తే మా జీవనం గడుస్తుంది’అని ఆవేదన వ్యక్తం చేశాడు. తుగ్గలిలో దివ్యాంగులైన ప్రసన్నరాణి, శకుంతల, బసవరాజు, వీరాంజనేయులు ప్రతిపక్ష నేతను కలిశారు.
తమకు ఇంటి స్థలాలు, అంత్యోదయ కార్డులు లేవని, ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి పింఛను వస్తుంటే.. ఆ ఇంట్లో దివ్యాంగులుంటే వారికి పింఛను ఇవ్వలేమని, నిబంధనలు అలాగే ఉన్నాయని అధికారులు కరాఖండిగా చెబుతున్నారని వారు వాపోయారు. ప్రస్తుతం దివ్యాంగులకు ప్రభుత్వం ఇస్తున్న పింఛను ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు. దివ్యాంగుడినైన తనకు మూడు చక్రాల వాహనం ఇవ్వలేదని ముక్కెళ్ల గ్రామస్తుడు కోదండరాముడు ఆవేదన వ్యక్తం చేశాడు. వీరి సమస్యలు విన్న జగన్.. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు రూ.3 వేల పింఛన్ ఇవ్వడంతో పాటు ఇంట్లో ఎంత మంది దివ్యాంగులున్నా అందరికీ పింఛను ఇస్తామని భరోసా ఇచ్చారు. ఒకే ఇంట్లో ఉండే వృద్ధ దంపతులిద్దరికీ కూడా పింఛన్ ఇస్తామని చెప్పారు.
గిట్టుబాటు ధర లేదయ్యా..
రాతన గ్రామం దాటాక జగన్‌ను పత్తి రైతులు కలిసి తమ సమస్యలు విన్నవించారు. మహిళా రైతులు శ్రీదేవి, సుంకమ్మ మాట్లాడుతూ ‘సార్.. 5 ఎకరాల్లో పత్తి వేశాం. పెట్టుబడి ఖర్చు రూ.2 లక్షలు అయ్యింది. పత్తికి వైరస్ సోకి దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు రెండు మూడు క్వింటాళ్లు కూడా దిగుబడి రాని పరిస్థితి. మార్కెట్లో పత్తి పంటకు గిట్టుబాటు ధర లేదు. ఎలా బతకాలో అర్థం కావడం లేద’ంటూ కంటతడి పెట్టారు. జగన్ వారిని అనునయిస్తూ ‘అధైర్య పడకండి.. దళారిగా మారిన ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే రైతులకు ఈ దుస్థితి దాపురించింది. రైతుల పంటను తక్కువ ధరకే కొనుగోలు చేసి ఆయన హెరిటేజ్ షాపులో మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నాడు’అన్నారు. అదే సమయంలో మార్కెట్‌లో టమాటాలు విక్రయించి వస్తున్న రైతుల వాహనం అటుగా వచ్చింది. 25 కిలోల బాక్స్‌ను రైతుల దగ్గర నుంచి ఎంతకు కొనుగోలు చేశారని జగన్ ప్రశ్నించగా.. రూ.150కి కొనుగోలు చేశారని రైతులు చెప్పారు.
ఇదే టమాటాను హెరిటేజ్ షాపులో కిలో రూ.50 చొప్పున అమ్ముతున్నారన్నారు. ‘ఇదీ చంద్రబాబు పాలన. ముఖ్యమంత్రి ఇంత దారుణంగా రైతులను మోసం చేస్తున్నాడు. కొంచెం ఓపిక పట్టండి. మన ప్రభుత్వం రాగానే రైతులు పండించే పంటలకు ముందుగానే గిట్టుబాటు ధర నిర్ణయిస్తాం’అని ప్రతిపక్ష నేత వారికి హామీ ఇచ్చారు. పాదయాత్ర మధ్యలో బుడగ జంగాలు జననేతను కలిసి సమస్యలు విన్నవించారు. జీవో 144 రద్దు చేయించాలని కోరారు. ఈ విషయమై ఇది వరకే అసెంబ్లీలో చర్చ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మీకు న్యాయం చేస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన రాతన గ్రామానికి చేరుకోగానే ఘన స్వాగతం లభించింది.
అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడున్న వారందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగారు. పాదయాత్రలో జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, పుష్పవాణి, విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, అరకులోయ, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, బీవై రామయ్య, శిల్పాచక్రపాణిరెడ్డి తదితరులు జగన్‌ను కలిశారు.


