‘వాళ్ల ఆస్తులు పోతాయని భయపడుతున్నారు’

Peddireddy Ramachandra Reddy Press Meet In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి : అధికార వికేంద్రీకరణ ఉంటేనే బాగుంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అలా అయితేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు హైదరాబాద్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో.. ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందలేదని గుర్తుచేశారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారే రాజధాని అంశంపై ఆందోళనలు చేస్తున్నారని.. వాళ్ల ఆస్తులు పోతాయని భయపడుతున్నారని మండిపడ్డారు. తుళ్లూరులో చంద్రబాబు బినామీలకే ఎక్కువ భూములు ఉన్నాయని విమర్శించారు. అమరావతిలో అవసరమైన మేరకు భూములను ఉంచుకుంటామని.. మిగతా భూములను తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు.

తాగునీటికి సీఎం జగన్‌ అధిక ప్రాధ్యన్యత ఇస్తున్నారు
రాష్ట్రంలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాగునీటికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మొదటి విడత శ్రీకాకుళం జిల్లా ఉద్దానంకు ప్రాధాన్యత ఇచ్చినట్టు పేర్కొన్నారు. మదనపల్లె, పుతలపట్టు, తంబళ్లపల్లి ప్రాంతాల్లో కొత్తగా 5 టీఎంసీలతో రిజర్వాయర్లు నిర్మించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణమే సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయమని అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top