చంద్రబాబు అవినీతిలో పవన్‌కు భాగం

Pawan part of the chandrababu corruption - Sakshi

అందుకే అధికారపార్టీ లూటీని ప్రశ్నించడం లేదు

నాలుగున్నరేళ్ల తర్వాత ఫిరాయింపులపై ఉపరాష్ట్రపతి మాట్లాడడం విడ్డూరం 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌

విజయవాడ సిటీ: నాలుగేళ్ల పాటు చంద్రబాబుతో అంటకాగిన పవన్‌కల్యాణ్‌కూ ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతిలో భాగం ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే అధికార పార్టీ అవినీతిని ఎందుకు నిలదీయడంలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గురువారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఘన నివాళి అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లుగా దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రాజ్యాంగానికి సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలపై ప్రతిపక్షం రాజీలేని పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీల ఫిరాయింపులపై ఇన్నాళ్లూ మౌనం వహించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

ఉన్నత ఆశయాలతో పార్టీని స్థాపించి, 67 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను గెలిపించుకున్న వైఎస్‌ జగన్‌ సామర్థ్యం గురించి పవన్‌కల్యాణ్‌ మాట్లాడటం అవివేకమని మండిపడ్డారు. గత నాలుగున్నరేళ్లుగా కరువు, చేనేత కార్మికుల సమస్యలు, దళితుల మీద దాడులు, రాజధానిలో భూ కబ్జాలపై వైఎస్సార్‌సీపీ చేసిన పోరాటాలు జ్ఞాపకం లేదా అని పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులైన మాజీ చీఫ్‌ సెక్రటరీలు చంద్రబాబు లూటీ గురించి ప్రశ్నిస్తే వాటి గురించి పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌ తెలంగాణ ఎన్నికల్లో డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికి పోయారన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎస్సీ, ఎస్టీ ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు కారులు కొనుగోలులో రూ. 500 కోట్లు కుంభకోణం జరిగిందని, అదే డబ్బు తెలంగాణలో జూపూడి పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top