ఆశ..నిరాశ

Party Tickets Nill For Senior Leaders In Telangana Elections - Sakshi

ముఖ్య నేతలకు భంగపాటు

టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీల్లోనూ మొండి చేయి  

ఎవరూ ఊహించని వారికి టికెట్లు

సాక్షి,సిటీబ్యూరో: రాజకీయ చదరంగంలో పావులు ఎలా కదులుతాయో.. అధిష్టానం ఎవరిని ఎప్పుడు కరుణిస్తుందో తెలియదు. ఇప్పుడు గ్రేటర్‌ పరిధిలో ఇదే నిజమైంది. ముఖ్యనేతలకు టికెట్లు దక్కుతాయనుకుంటే వారు తలచిందొకటి.. జరిగిందొకటన్న చందంగా పరిస్థితి మారింది. దశాబ్దాలుగా నమ్ముకున్న పార్టీకి సేవలు అందిస్తున్నవారిని టికెట్ల విషయంలో పక్కనబెట్టారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీల్లోనూ ముఖ్య నేతలకు ఈ పరిస్థితి ఎదురు కావడం గమనార్హం.

పార్టీల వారీగా పరిశీలిస్తే ప్రధాన, సీనియర్‌ నేతలు ఈ జాబితాలోఉన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ముఖ్య నేతలకు టికెట్ల విషయంలో నిరాశ తప్పలేదు. ఆపద్ధర్మ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి ముషీరాబాద్‌ టికెట్‌ కోసం చివరి దాకా ప్రయత్నించారు. ఆయనకు కాకపోతే తనకైనా పోటీ చేసే అవకాశం కల్పించాలని పార్టీ అధినేత వద్ద ఏకరువు పెట్టినా వివిధ సమీకరణల నేపథ్యంలో ఈ టికెట్‌ను ముఠా గోపాల్‌కు కేటాయించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డిని పక్కనబెట్టి ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావుకు టికెట్‌ ఇచ్చారు. ఇక మేడ్చల్‌లోనూ ఇదే పరిస్థితి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి మల్కాజిగిరి  ఎంపీ మల్లారెడ్డిని పార్టీ బరిలోకి దించింది.

వీరికి రిక్త‘హస్తం’
సికింద్రాబాద్‌ నియోజకవర్గ టికెట్‌ కోసం మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి తన నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఆమెకు టికెట్‌ దక్కలేదు. అనూహ్యంగా కాసాని జ్ఙానేశ్వర్‌కు పార్టీ బీ–ఫారం ఇచ్చింది. కాంగ్రెస్‌లో మరో సీనియర్‌ నేత, ఎన్నికల జాబితాలో జరిగిన అక్రమాలపై న్యాయ పోరాటం చేసిన మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డికి సనత్‌నగర్‌ టికెట్‌ దక్కలేదు.  ఆయన్ను హైకమాండ్‌ పెద్దలు బుజ్జగించి మరో బాధ్యత అప్పగించారు. ఇక రాజేంద్రనగర్‌లో మాజీ హోంమత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి టికెట్‌ ఆశించినా ఆయనకూ నిరాశ తప్పలేదు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. శేరిలింగంపల్లిలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. 

టీడీపీలోనూ అదే తీరు..
ఈ పార్టీలోని ముఖ్య నేతలదీ ఇదే పరిస్థితి. కూకట్‌పల్లి టికెట్‌ ఆశించిన ఆ పార్టీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డికి నిరాశే ఎదురైంది. నందమూరి సుహాసిని అనూహ్యంగా తెరమీదకు రావడంతో ఆయనకు పోటీచేసే అవకాశం దక్కలేదు. ముషీరాబాద్‌లో పార్టీ నేత ఎంఎన్‌ శ్రీనివాస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించినా.. పొత్తులో కాంగ్రెస్‌కు వెళ్లింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top