44వేల ప్రపోజల్స్‌.. ఆ అమ్మాయినే చేసుకుంటా!

parents will arrange my wedding, says Tejashwi Yadav - Sakshi

తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే చేసుకుంటాను

నాది అరెంజ్‌డ్‌ మ్యారెజే.. ఇప్పుడు తొందరేమీ లేదు

పట్నా: లాలూప్రసాద్‌ యాదవ్‌ రాజకీయ వారసుడు, బిహార్‌ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్‌ అనతికాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తండ్రికి తగ్గ వారసుడిగా రాజకీయాల్లో రాణిస్తున్న ఈ 28 ఏళ్ల యువ బ్రహ్మచారికి ఇప్పటికే 44వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. అయినా ఇప్పుడే పెళ్లికి తొందరేమీ లేదంటున్నారు తేజస్వి. తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని, తనది అరెంజ్‌డ్‌ మ్యారేజ్‌ కానుందని తెలిపారు.

లాలుప్రసాద్‌ యాదవ్‌ జైలుపాలైన తర్వాత ఆర్జేడీ నడిపిస్తున్న తేజస్వి.. ఇటీవలి బిహార్‌ ఉప ఎన్నికల్లో ఘనవిజయాలు దక్కడంతో జోరుమీద ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవద్దని ఆయన భావిస్తున్నారు. ‘ రాజకీయాల్లో నా పెద్దన్నలైన చిరాగ్‌ పాశ్వాన్‌, నిషాంత్‌కుమార్‌ పెళ్లి చేసుకునే వరకు నేను పెళ్లి చేసుకోను’ అని ఆయన అంటున్నారు. చిరాగ్‌ ఎల్జేపీ అధినేత రాంవిలాస్‌ పాశ్వన్‌ తనయుడు కాగా, నిశాంత్‌ జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ కొడుకు.

తేజస్వి లాలు చిన్న కొడుకు అయినప్పటికీ.. లాలూ రాజకీయ వారుసుడిగా తెరపైకి వచ్చారు. లాలూ కొడుకు తేజ్‌ ప్రతాప్‌, కూతురు మిసా భారతి రాజకీయాల్లో ఉన్నప్పటికీ వారికి రాని రాజకీయ గుర్తింపు తేజస్వి సంపాదించారు. బిహార్‌ ఉప ముఖ్యమంత్రిగా, రోడ్డు నిర్మాణ శాఖ ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్నప్పుడు.. ఆయనకు వాట్సాప్‌లో 44వేల పెళ్లి ప్రతిపాదనలు రావడం అప్పట్లో హల్‌చల్‌ చేసింది. రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా.. తేజస్వి ఇంకా పెళ్లి చేసుకోకపోవడం చర్చనీయాంశం కాగా.. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘భారతీయ కుటుంబాల్లో పిల్లలకు తల్లిదండ్రులు పెళ్లిళ్లు నిశ్చయం చేస్తారు. నా పెళ్లి కూడా మా అమ్మనాన్నల ఇష్టప్రకారం జరుగుతుంది’  అని తేజస్వి చెప్పాడు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top