అట్టుడికిన పెద్దలసభ.. వెంకయ్య ఆగ్రహం

NRC Row Venkaiah Naidu Unhappy with Congress - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పెద్దల సభలో అసోం ఎన్‌ఆర్‌సీ అంశంపై చర్చ అట్టుడికిపోయేలా చేసింది. రాజ్యసభ సభ్యుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ భగ్గుమంది. ‘అసలు ఎన్‌ఆర్‌సీని తీసుకొచ్చిందే కాంగ్రెస్‌’ అంటూ షా పేర్కొనటంతో సభలో గందరగోళం నెలకొంది. ఒకానోక దశలో సహనం కోల్పోయిన చైర్మన్‌ వెంకయ్య నాయుడు సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘ఎన్‌ఆర్‌సీ మేం తీసుకొచ్చిన కార్యక్రమం కాదు. 1985లో రాజీవ్‌ గాంధీ అసోం ఒప్పందంపై సంతకం చేశారు. నాడు అమలు చేయడానికి వాళ్లు ధైర్యం చేయలేదు. నేడు మేం ధైర్యంగా ముందుకొచ్చాం. దీనిపై విపక్షాలు చేస్తున్న రాద్ధాంతం అర్థం లేనిది’ అంటూ అమిత్‌ షా ప్రసంగించారు. ఆ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌తోపాటు ఇతర పక్షాల సభ్యులు కూడా స్పీకర్‌ పోడియంలోకి దూసుకొచ్చారు. నిరసనలు, గందరగోళం నడుమ పెద్దల సభను చైర్మన్‌ వెంకయ్య నాయుడు వాయిదా వేశారు. 

వెంకయ్య ఆగ్రహం.. ఇదిలా ఉంటే సభలో నేడు జరిగిన పరిణామాలపై వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సభ్యుల తీరుపై అసంతృప్తిని వెల్లగక్కిన ఆయన.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ను తన ఛాంబర్‌లోకి పిలిపించుకుని మాట్లాడారు. ఇదిలా ఉంటే పార్లమెంట్‌ ఆవరణలో సైతం బీజేపీ-కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి అశ్విన్‌ దుబే, కాంగ్రెస్‌ ఎంపీ ప్రదీప్‌ ఇద్దరూ మీడియా ముందే ఇష్టానురీతిలో దూషించుకున్నారు.

సుప్రీం కీలక ఆదేశాలు... మరోవైపు ఎన్‌ఆర్‌సీ డ్రాఫ్ట్‌పై సుప్రీం కోర్టు మంగళవారం కీలక ఆదేశాలు చేసింది. ‘ప్రస్తుతం రూపొందించింది డ్రాఫ్ట్‌ మాత్రమే. ఎవరిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి హక్కు లేదు. ఈ విషయంలో కేంద్రం కూడా చొరవ చూపాలి. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోసీడర్‌(ఎస్‌ఓపీ)ని ఏర్పాటు చేసి అభ్యంతరాలపై చర్చించాలి. ఆగష్టు 16లోపు ఎస్‌ఓపీ వివరాలను ధృవీకరణ కోసం బెంచ్‌ ముందు ఉంచాలి’ అని జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ పేర్కొన్నారు. సున్నితమైన అంశం కావటంతో శాంతి భద్రతలు దెబ్బ తినకుండా ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం సూచించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top