ఉపఎన్నిక సీఎంకు సవాలే

Nitish Kumar  Face Challenge From Tejashwi  For Jokihat Bypoll - Sakshi

పాట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌... ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ నుంచి కొత్త సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. ఆర్డేడీ-కాంగ్రెస్‌ కూటమి నుంచి విడిపోయి ఎన్డీఏలో చేరిన జేడీయూ ఇటీవల జరిగిన ఆరారియా లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. త్వరలో జరుగనున్న జోకిహత్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఇప్పుడు నితీష్‌కు సవాలుగా మారింది. వచ్చేవారం జోకిహత్‌ ఉపఎన్నిక జరుగనుండడంతో క్యాబినెట్‌ మంత్రులందరిని నియోజకవర్గంలో మోహరించారు.

జేడీయూ అభ్యర్ధి ముర్షిద్‌ ఆలంపై ఒక గ్యాంగ్‌ రేప్‌తో సహా ఏడు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. తేజస్వీపై అవినీతి కేసులు ఉన్నాయన్న ఆరోపణలతో కూటమి నుంచి బయటకు వెళ్లిన నితీష్‌ ఇప్పుడు క్రిమినల్స్‌కి పార్టీ టిక్కెట్లు ఇస్తున్నారని ఆర్జేడీ విమర్శిస్తోంది. జోకిహత్‌ ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ ఆలం ఆరారియా లోక్‌సభ నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికవ్వడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమయింది. జేడీయూ నుంచి ముర్షిద్‌ ఆలం పోటీ చేస్తుండగా, మాజీ ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ ఆలం సోదరుడు షానవాజ్ ఆలంను ఆర్జేడీ పోటీలో నిలిపింది.

ప్రచారంలో భాగంగా శుక్రవారం ఓ సమావేశంలో మాట్లాడిన తేజస్వీ నితీష్‌పై విమర్శల వర్షం కురిపించారు. నితీష్‌ రాష్ట్రానికి సీఎం అయినా కూడా పరిపాలనంతా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవాత్‌ కనుసన్నలో నడుస్తోందని విమర్శించారు. నితీష్‌ బీజేపీతో కలిసిన కూడా విజయం తమదేనని తేజస్వీ ధీమా వ్యక్తం చేశారు. జేడీయూ-బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో మతతత్వ ఘర్షణలను ప్రోత్సహిస్తోందని అన్నారు. ఇటీవల భాగల్పూర్‌లో జరిగిన ఘర్షణలో కేంద్రమంత్రి అశ్విని చోబే కుమారుడు ఉన్నా కూడా ప్రభుత్వం అతనిపై ఏలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top