
‘నాయకులు తమకు పెద్ద పెద్ద కలలు చూపించాలని ప్రజలు కోరుకుంటారు. కానీ ఆ కలల్ని నిజం చేయకుంటే వారిని రాజకీయంగా కొడతారు. అందుకే నేతలు అమలుచేయగలిగే హామీలే ఇవ్వాలి’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్న మాటలు అనేక అర్థాలకు తావిచ్చాయి. అనేక రకాలుగా అర్థంచేసుకునేలా ఆయన మాట్లాడటం కొత్తేమీ కాదు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు, అనేక మంది ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు.
2014 ఎన్నికల్లో చేసిన అనేక వాగ్దానాలను బీజేపీ నెరవేర్చలేకపోయిందని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో గడ్కరీ మాటలను అధికార పార్టీ అగ్రనేతలకు పరోక్ష హెచ్చరికగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి విషయాలపై సూటిగా మాట్లాడకుండా, తర్వాత తన ఉద్దేశం వేరని చెప్పడం గడ్కరీకి అలవాటే. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు హిందీ రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయినప్పుడు కూడా ఆయన ఇలాగే వ్యాఖ్యానించి సంచలనానికి కారణమయ్యారు.
ఎన్నికల ముందు మాటలకు అర్థాలు వేరులే!
లోక్‌సభ ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు బీజేపీ మాజీ అధ్యక్షుడు కూడా అయిన గడ్కరీ ఇలా ‘అపార్థాల’కు దారితీసేలా మాట్లాడటం దేన్ని సూచిస్తోంది? ఈ విషయంపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. బీజేపీ 2019 ఎన్నికల్లో 200 సీట్ల దగ్గర నిలిచిపోతే ప్రధాని పదవికి బీజేపీ అభ్యర్థిగా ఆయన తన అభ్యర్థిత్వాన్ని ముందుకు తెస్తున్నారని రాజకీయ పండితులు కొందరు అభిప్రాయపడ్డారు.
1996–99 మధ్య మహారాష్ట్ర శివసేన–బీజేపీ సంకీర్ణ సర్కారులో మంత్రిగా అనుభవం ఉన్న గడ్కరీ మొదటిసారి 2014లో నాగ్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాక కేంద్ర మంత్రిగా చేరి కీలక శాఖ నిర్వహిస్తున్నారు. ఆరెసెస్‌కు గడ్కరీ చాలా ఇష్టుడనే ప్రచారం కూడా ఉంది. మోదీ కూడా ఆరెసెస్ ‘మనిషే’అయినా ఆయన ఐదేళ్ల పాలన తర్వాత బీజేపీ మళ్లీ మెజారిటీ సాధించలేకపోతే గడ్కరీని సంఘ్ రంగంలోకి దింపుతుందనీ, మోదీని ప్రధానిగా అంగీకరించడానికి ఇష్టపడని పార్టీలు గడ్కరీ పేరును ఆమోదిస్తాయనే ప్రచారం కూడా సాగుతోంది.