ఎన్నికల వరకే రాజకీయాలు: ఎమ్మెల్యే శిల్పా

Nandyala MLA Shilpa Ravichandrakishore Reddy Said In The Assembly That The CM Goal Is To Ensure A Corruption Free Regime - Sakshi

ఇది మా నాయకుడు ఇచ్చిన గొప్ప పిలుపు 

అవినీతి రహిత పాలనే సీఎం లక్ష్యం 

అసెంబ్లీలో  తొలి ప్రసంగంలోనే అదరగొట్టిన ఎమ్మెల్యే శిల్పా రవి

సాక్షి, కర్నూలు/ నంద్యాల: ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అందరి సంక్షేమానికి కృషి చేయాలని  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలే  తమకు స్ఫూర్తి అని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి పేర్కొన్నారు. కులం, మతం, పార్టీలు చూడమన్నారు.  తమకు ఓటు వేయని వారికి సైతం  ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు.  శుక్రవారం అసెంబ్లీలో ఆయన  చేసిన తొలి ప్రసంగం ఆకట్టుకుంది. చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా..సూటిగా చెప్పి స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు అందుకున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రసంగం సాగిందిలా ‘పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృత నిశ్చయంతో  ఉన్నారు.

రాష్ట్రంలోని  25 లక్షల మంది నిరుపేదలకు  స్థలాలు ఇచ్చి వాటిలో ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు  నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.  దివంగత వైఎస్‌ఆర్‌లాగా తమ ముఖ్యమంత్రి  ప్రజల మనసును గెలుచుకుంటున్నారు. గతంలో కూడా పలు ప్రభుత్వాలు పేదలకు గృహాలు  కట్టించి ఇచ్చాయి. అయితే మా ప్రభుత్వం  కట్టించి ఇచ్చే ఇంటిపై  లబ్ధిదారుడు అవసరాల కోసం బ్యాంకులో రుణం సైతం పొందవచ్చు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 300 చదరపు అడుగుల ఇంటి కోసం పేదల నుంచి రూ.2.65 లక్షలు వసూలు చేశారన్నారు.  తమ ప్రభుత్వం చేపట్టే కొత్త ఇళ్ల నిర్మాణానికి నంద్యాల, బేతంచెర్లలో ఉండే క్వారీల్లో దొరికే బండలు, టైల్స్‌ను తీసుకుని మూతపడుతున్న పరిశ్రమలకు జీవం పోయాలని కోరుతున్నాను.

రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కోసం మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పడుతున్న ఆరాటాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీయడానికి రివర్స్‌ టెండర్‌ విధానం, జ్యుడీషియల్‌ విచారణకు శ్రీకారం చుట్టార’న్నారు. చివరకు అసెంబ్లీలో  మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన స్పీకర్, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రికి   కృతజ్ఞతలు చెప్పి ప్రసంగాన్ని ముగించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top