దంచుకో... దోచుకో... దాచుకో

Nagam janardan reddy fired on trs - Sakshi

టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో జరిగిందిదే

కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ధ్వజం

కేసీఆర్, హరీశ్‌ల అవినీతిని బయటపెడతా

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలన అవినీతిమయమని, ఆ పార్టీ నేతల అవినీతితోనే తెలంగాణలో అభివృద్ధి ఆగిపోయిందని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. దంచుకో, దోచుకో, దాచుకో పద్ధతిలోనే ఈ నాలుగేళ్ల పాలన జరిగిందని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అవినీతిని తాను బయటపెడతానని, అప్పుడు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్, కేటీఆర్, వారికి సహకరించిన అధికారులంతా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నాగం విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును తామే అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని టీఆర్‌ఎస్‌ ప్రచారార్భాటాలకు పోతోందని, అసలు ఆ ప్రాజెక్టు డీఎన్‌ఏ కాంగ్రెస్‌ హయాం లోనిదేనన్నారు. కేసీఆర్‌ అపర భగీరథుడంటూ మీడియాలో ప్రకటనలిస్తున్నార ని, అయితే అసలు భగీరథుడైన వైఎస్సార్‌ చనిపోయారని నాగం చెప్పారు. వైఎస్సార్‌ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజం పడిందని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారాలను మానుకోకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ‘ఇది కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు’అని బోర్డు పెట్టిస్తానని హెచ్చరించారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను ఉధృతంగా నిర్మిస్తుంటే తామేదో కాళ్లలో కట్టెలు పెడుతున్నామని మంత్రి హరీశ్‌ వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. ‘హరీశ్‌ యూజ్‌లెస్‌ ఫెలో... నీ కాళ్ల కింద కట్టెలు పెట్టిందెవరు? రూ. 2,098 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇప్పటివరకు మీరు ఖర్చు పెట్టింది రూ. 40–50 కోట్లు మాత్రమే. ఇలాగైతే ఎప్పటికి పూర్తవుతుంది? అసలు ఆ ప్రాజెక్టు విషయంలో ఏం జరిగిందన్నది నేను సమాచార హక్కు చట్టం కింద అడిగితే ఆ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తాము చెప్పలేమని అధికారులు సమాధానమిచ్చారు. అదీ దుర్మార్గమే.

మీరు నిజాయితీగా పనిచేస్తుంటే నేను అడిగిన సమాధానం ఎందుకు ఇవ్వరు? మీ బాంబే తమాషాలు ఆపండి’అని నాగం విమర్శించారు. ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డేనని టీఆర్‌ఎస్‌ నేతలు సంకలో పెట్టుకుని తిరుగుతున్నారని, వేరే వాళ్లు చేసిన పనులను కూడా తమ ఖాతాల్లో వేసుకునే టీఆర్‌ఎస్‌ ఆటలు ఇక సాగవని ఆయన హెచ్చరించారు. ఓట్లడగడానికి ఊళ్లలోకి వెళ్తే డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయని, రుణమాఫీ, మూడెకరాల భూ పంపిణీ, కేజీ టు పీజీ, ఇంటికో ఉద్యోగం, 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్ల గురించి నిలదీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్‌ అవినీతి గురించి మాట్లాడుతున్నందుకే తనకు భద్రత తొలగించారని, అయితే తనకు ప్రజలే సెక్యూరిటీ అని నాగం పేర్కొన్నారు.

వై.ఎస్‌.ను అసెంబ్లీలోనే అభినందించా...
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రారంభమయ్యాయని, ఈ విషయం చెప్పి అప్పుడే అసెంబ్లీలో ఆయనను అభినందించానని నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు. కుయ్‌కుయ్‌ అంటూ 108, ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ, ఆకాశమే హద్దుగా పేదలకు ఇళ్లు, ఉచిత విద్యుత్‌ అన్నీ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి హయాంలోనే అమలయ్యాయని చెప్పారు. అప్పుడు ప్రారంభించిన విద్యుత్‌ ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తయిన కారణంగానే కరెంటు మనకు వస్తోందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top