పోలవరంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు

mvs nagi reddy press meet on polavaram project - Sakshi

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి

సాక్షి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని గతంలో సొంత పార్టీ నాయకులను తిట్టిన ఘనుడు చంద్రబాబు అని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కారుకు చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. కాకి లెక్కలు చెబుతూ ప్రజలను టీడీపీ ప్రభుత్వం మభ్యపెడుతోందని మండిపడ్డారు.

2004లో ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్‌ రాజశేఖరరెడ్డి సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని నాగిరెడ్డి తెలిపారు. సాధ్యంకాదనుకున్న పోలవరం ప్రాజెక్టుకు అనేక అనుమతులు తీసుకొచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇందిరాసాగర్‌గా నామకరణం చేసి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. వైఎస్సార్‌ మరణం తర్వాత ప్రాజెక్టు నిర్మాణం పక్కదారి పడుతుందని వైఎస్‌ జగన్‌ జగన్‌.. రావులపాలెం నుంచి పోలవరం వరకు పాదయాత్ర చేశారని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ కూడా అనేక ఉద్యమాలు చేసిందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రథమ పాధాన్యం గోదావరి డెల్టా అని.. రెండో ప్రాధాన్యం విశాఖపట్నం, కాకినాడ నగరాలకు తాగునీరు, ఇండస్ట్రియల్‌ వాటర్‌.. మూడో ప్రాధాన్యం కృష్ణా డెల్టా స్థిరీకరణ, ఉత్తరాంధ్రకు నీరు, రెండు ప్రాంతాల్లో కొత్తగా 7 లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయడమన్నారు.

రాష్ట్ర విభజనకు ముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 5,135 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దీన్ని కేంద్రమే నిర్మిస్తుందని విభజన చట్టంలో పేర్కొన్నారని తెలిపారు. పోలవరంపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రమే నిర్మాణ బాధ్యలు రాష్టానికి ఇచ్చిందని ఒకసారి, తమ విజ్ఞప్తి మేరకే ఇచ్చిందని మరోసారి అసెంబ్లీలో చెప్పారని దుయ్యబట్టారు. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించి నాలుగేళ్లు గడిచిందన్నారు. 2018 నాటికే నిర్మాణం పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు శాసనసభలో ప్రకటించారని గుర్తు చేశారు. హడావుడిగా ప్రాజెక్టు పనులు చేస్తున్నారని, 2019 నాటికి పోలవరం పూర్తి కాదని నాగిరెడ్డి స్పష్టం చేశారు. అంచనా వ్యయాన్ని ఇష్టమొచ్చినట్టుగా పెంచేయడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు, కేంద్ర ఎన్నినిధులు ఇచ్చిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

Back to Top