కాంగ్రెస్‌కు ఓటేస్తే ‘చంద్ర’ గ్రహణమే

Muralidhar Rao comments on Congress Party and Chandrababu - Sakshi

పాలన చంద్రబాబు చేతుల్లోకే: మురళీధర్‌రావు 

సాక్షి, సిద్దిపేట/వనపర్తి: రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే అధికారం.. చంద్రబాబు చేతిలోకి వెళ్తుందని, తెలంగాణకు చంద్రగ్రహణం పడుతుందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు విమర్శించారు. సోమవారం సిద్దిపేట బీజేపీ అభ్యర్థి నరోత్తంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్‌ కమిటీల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఎన్నికల్లో 21 మంది కాంగ్రెస్, 15 మంది టీడీపీ, ఐదుగురు బీజేపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని వీరిలో ఒక్క బీజేపీ మినహా మిగిలిన పార్టీల్లోని అత్యధిక మంది టీఆర్‌ఎస్‌కు అమ్ముడు పోయారని విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన నాయకులకు ఓటడిగే హక్కు లేదని అన్నారు.

ప్రజలు ఐదు సంవత్సరాలు పరిపాలించమని అధికారం చేతికిస్తే చేతకాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, దీంతో ప్రభుత్వంపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అన్నారు.  అందులో భాగంగా సాధారణ కుటుంబం నుండి వచ్చిన నరేంద్ర మోదీకి ప్రధానమంత్రి పదవి అప్పగించారని అన్నారు. కేసీఆర్‌ రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ఈ నాలుగు సంవత్సరాల్లో విచ్చల విడిగా బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేసి ఎక్సైజ్‌ ఆదాయాన్ని ఆరింతలు పెంచారని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బంగారు తెలంగాణ చేయడం రాదని.. తాగుబోతుల తెలంగాణ మాత్రం చేస్తాడని రుజువైందని విమర్శించారు. 

అమరావతి నుంచి పాలన..  
కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే పాలన హైదరాబాద్‌ నుంచి కాకుండా అమరావతి నుంచి సాగుతుందని.. చంద్రబాబు అక్కడి నుంచే రిమోట్‌ ద్వారా పాలన నడిపిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఎద్దేవా చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ అభ్యర్థి కొత్త అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన బూత్‌ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. భావసారూప్యత లేని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ వంటి పార్టీల నాయకులు కూటమిని ఏర్పాటు చేసి అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అది మహాకూటమి కాదని.. మహా కుంపటి అని అభివర్ణించారు. రాహుల్‌ గాంధీ నాయకుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్‌ పార్టీకి గెలుపు సాధ్యం కాదని.. ఇది దేశంలో జరిగిన అనేక ఎన్నికల్లో రుజువైందని మురళీధర్‌రావు అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top