‘రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్‌ విందు’

Mukhtar Abbas Naqvi Hosts Iftar Party For Triple Talaq Victims On Same Day Of Rahul Gandhi Iftar Party - Sakshi

కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్‌ గాంధీ తొలిసారిగా బుధవారం ఇఫ్తార్‌ విందు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ కూడా బుధవారమే ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రాంతీయ పార్టీలను కూడగడుతున్న తరుణంలో కాంగ్రెస్‌ రెండేళ్ల తర్వాత ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేస్తుండటంతో.. అందుకు పోటీగానే బీజేపీ కూడా ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేస్తోందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ విషయంపై స్పందించిన ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘ రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్‌ గాంధీ ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఏవిధంగానూ మేము(బీజేపీ) కాంగ్రెస్‌తో పోటీ పడటం లేదు. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తనకు తానుగా ట్రిపుల్‌ తలాక్‌ బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్న విందు ఇది’ అని వ్యాఖ్యానించారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

కాగా రాహుల్‌ గాంధీ తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన విందుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం, జేడీయూ తిరుగుబాటు నేత శరద్‌యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు హాజరవుతారని సమాచారం. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖరరావు, నారా చంద్రబాబు నాయుడు సహా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆహ్వానాలు అందలేదని తెలుస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top