
సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ ఎన్నికల తర్వాత కూడా స్వతంత్ర అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన దళిత నేత జిగ్నేశ్ మేవాని ప్రధాని నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. మోదీ ప్రజలను పిచ్చివాళ్లను చేయాలని చూస్తున్నారని, అలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు. ప్రధాని మోదీ రాజకీయాల నుంచి తప్పుకునే సమయం ఆసన్నం అయిందని, ప్రజలు ఆయన చేసే పనులను సహించే పరిస్థితుల్లో లేరని అన్నారు.
ప్రజలు పిచ్చివాళ్లని అనుకోవడం మోదీ పొరపాటు అవుతుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను మోదీ మోసం చేశారని ధ్వజమెత్తారు. హార్థిక్ పటేల్ తో భేటీ అయిన జిగ్నేశ్ తమ మధ్య జరిగింది సామరస్య పూర్వక భేటీ అని చెప్పారు. అలాగే, భవిష్యత్తులో కూడా ఎలా పోరాడాలనే విషయాన్ని చర్చించుకున్నామని, తమ పోరాటం కేవలం దళితులు, పటేళ్ల కోసమే కాకుండా 6.50కోట్ల గుజరాతీల కోసం ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ అవినీతి రాజకీయాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని హెచ్చరించారు.