
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం చేపట్టిన పథకాల పేర్లు మార్చడం తప్ప.. ప్రధాని మోదీ చేసిందేమీ లేదని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. మోదీ సర్కారు గేమ్ చేంజర్ కాదని కేవలం నేమ్‌చేంజర్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. రైతులు, పేదలకు సాంత్వన కల్పించడంలో, ఉద్యోగాల కల్పనలో, కశ్మీర్ సమస్య పరిష్కారంలో మోదీ సర్కారు విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. రాజ్యసభలో సోమవారం ఆజాద్ మాట్లాడారు.
ఉపాధి లేక యువత రోడ్డున పడ్డారని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విచ్చలవిడిగా పెంచుతున్నారని ఆజాద్ మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. ‘మోదీ కేర్’గా విస్తృతంగా ప్రచారం అవుతున్న ‘ఆయుష్మాన్ భారత్ పథకం’ పెద్ద బూటకమని విరుచుకుపడ్డారు.