
తన తండ్రి (చంద్రబాబు) ఒక్క సీటు కూడా గెలిపించలేకపోయాడని పప్పు చాలా హ్యాపీగా ఉంటారని మంత్రి లోకేష్‌కు చురకలంటించారు.
సాక్షి, అమరావతి : నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు సమాధి చేయాలనుకున్నారని, ఆయన కుట్రలను జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు గమనించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఫలితాలను చూసి ఏపీ ప్రజలు ఆనందించారని, మనీ, మ్యానిపులేషన్, మీడియా చంద్రబాబును కాపాడలేకపోయాయని ఎద్దేవా చేశారు. కోట్టు ఖర్చు పెట్టి చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని.. ఏపీలో చంద్రబాబు చేసిన అభివృద్ది ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ నేరగాడు.. తప్పుచేసిన వారికి శిక్ష తప్పదన్నారు. అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌ను వైఎస్ రాజశేఖరరెడ్డి రెండుసార్లు అధికారంలోకి తెచ్చారని గుర్తుచేశారు. వైఎస్సార్ లేని కాంగ్రెస్ తల లేని మొండెం లాంటిదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓడటానికి ‘చంద్ర’ గ్రహణమే కారణమన్నారు. చంద్రబాబును పట్టుకుని నడవటం.. కుక్క తోక పట్టుకుని నడవటమే అంటూ విరుచుకపడ్డారు. కుట్రలు చేసి కట్టలతో చంద్రబాబు గెలవాలనుకున్నారని కానీ, తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు.
లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే శకుని వేసిన పాచికలాంటిదని విమర్శించారు. లగడపాటి మరో మాల్యా అని.. అప్పులు ఎగ్గొట్టడానికి పథకం రచించారని ఆరోపించారు. రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి.. సర్వే సన్యాసం చేస్తే మంచిదంటూ సూచించారు. కాంగ్రెస్‌తో టీడీపీ కలిస్తే బట్టలూడదీసి కొడతారని మంత్రి అయ్యన్న పాత్రుడు ఎప్పుడో చెప్పారంటూ గుర్తు చేశారు. తాను ఒక్క సీటైనా గెలిపించానని.. తన నాన్న (చంద్రబాబు) ఒక్క సీటు కూడా గెలిపించలేకపోయాడని పప్పు చాలా హ్యాపీగా ఉంటారని మంత్రి లోకేష్‌కు చురకలంటించారు. చంద్రబాబు ఇక పప్పును ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి అమ్మాల్సిందేనని, పప్పుకు కిరీటం పెట్టాలనుకున్న పథకాలు తారుమారయ్యాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు విజ్ఞతగా వ్యవహరించాలని కోరారు. వైఎస్ జగన్‌ను ఆదరిస్తే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్‌గా ఏమిస్తారోనని తాము కూడా ఆసక్తిగా గమనిస్తున్నామన్నారు.