కేసీఆర్‌ ఉగ్ర నరసింహ అవతారం ఎత్తొద్దు: జగ్గారెడ్డి

 MLA Jagga Reddy Questioned KCR Over Disha Accused Encounter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏ ప్రభుత్వమైనా ప్రజల అభీష్టం మేరకు పనిచేయాలని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఒక ఆడపిల్ల తండ్రిగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను తాను సమర్థిస్తానని చెప్పారు. సీపీ సజ్జనార్‌ కరెక్ట్‌ అంటూ పోలీసులు పని తీరును ప్రశంసించారు. గవర్నర్‌ తమిళిసైను కలిసిన తర్వాత శనివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిత్యం రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాప్రభుత్వం, పోలీసుల దృష్టికి వచ్చిన కొన్ని సంఘటనలే హైలెట్ అయ్యాయని విమర్శించారు. అయితే కొన్ని సంఘటనలపై మాత్రమే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినందున పోలీసులు స్పందించారని చెప్పారు.

శాసనసభ్యునిగా తనకు కొన్ని పరిమితులు ఉంటాయని, చట్టం ప్రకారం నిందితులను శిక్షిస్తే బాగుంటుందనేది రెండో అభిప్రాయమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు మిస్ యూజ్ అయ్యే అవకాశం ఉందని, మరి దిశ కంటే ముందే జరిగిన అత్యాచారాలకు పరిష్కారం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు జరగకుండా సరైన పరిష్కారం కోసం ఆలోచించాలని సూచించారు. దిశ కంటే ముందు జరిగిన హత్యలపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన తనను కూడా జైళ్లో వేశారని, అధికారం ఉంది కదా అని జగ్గారెడ్డిని జైల్లో వేయమని కేసీఆర్ అంటే వేశారని ఆరోపించారు. రేపు జగ్గారెడ్డి అధికారంలో ఉంటే కేసీఆర్‌ను జైల్లో వేయమన్నా వేస్తారన్నారు. హజీపూర్ నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్ చేస్తారేమో చూడాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. 

మహిళలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి
నిత్యానంద స్వామిపైన కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఆయన ఆడపిల్లలను అత్యాచారం చేసి పూడ్చిపెట్టే వారిని, స్వామిని కూడా ఎన్‌కౌంటర్ చేసే అవకాశం ఉందా అని నిలదీశారు. మహిళల రక్షణ కోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, సమస్య ఎక్కడుందో దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయాలని కోరారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ న్యాయ పరంగా జరిగిందా.. రాజకీయ పరంగా జరిగిందా అని ప్రశ్నించారు. ‘కేసీఆర్‌ ఇప్పుడు ఉగ్ర నరసింహ అవతారం ఎత్తాడని మంత్రి తలసాని అంటున్నారు. అంటే తెలంగాణలో ఎప్పుడూ అత్యాచారాలు, హత్యలు జరగాలి.. ఎన్‌కౌంటర్‌లు జరగాలని మీ ఉద్ధేశమా’ అని మంత్రిపై విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో అత్యాచారాలు జరగవద్దని, కేసీఆర్‌ ఉగ్ర నరసింహ అవతారం ఎత్తవద్దని హితవు పలికారు. ఎన్‌కౌంటర్‌ను సమర్థించేలా మంత్రితో ప్రకటన చేయించారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అర్ధరాత్రి వరకు పబ్‌లు తెరిచే ఉంటున్నాయని, వాటికి మాత్రం పోలీసులు పహారా కాస్తున్నారని విమర్శించారు. 

మేము క్షమాపణలు కోరుతున్నాం
‘కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు పోలీసుల కంటే ముందుగా స్పందిస్తారు. హజీపూర్ సమస్యలో కూడా హనుమంతరావు న్యాయం కోసం పోరాడుతున్నారు. వీహెచ్‌ వంటి నేత కాంగ్రెస్‌ పార్టీలో ఉండటం మా అదృష్టం. మహిళా గవర్నర్ మేము చెప్పిన అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై స్పందించారు. గవర్నర్‌ను కలిసే జాబితాలో ఈ రోజు హనుమంతరావు పేరు లేకపోవడం తప్పిదమే. మేమే క్షమాపణలు చెబుతున్నాము. ఇలాంటి సంఘటన మరొక్కసారి జరగకుండా చూసుకుంటాం. హనుమంతరావు లక్ష్యం రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top