ఆ నలుగురి నామినేషన్లు తప్పుల తడకే

Mistakes In TDP Leaders Nomination Papers - Sakshi

చంద్రబాబు నివాసం గుంటూరు జిల్లా ఉండవల్లి 

నోటరీ తయారు చేసింది కృష్ణా జిల్లా న్యాయవాది  

అఫిడవిట్‌లో ఆస్తులను వివరాలను దాచిన చంద్రగిరి అభ్యర్థి 

తిరుపతి, జీడీ నెల్లూరు టీడీపీ అభ్యర్థుల ఆస్తుల వివరాలను దాచిపెట్టిన వైనం 

సాక్షి, తిరుపతి: సీఎం చంద్రబాబు నామినేషన్‌తో పాటు చిత్తూరు జిల్లాలోని మరో ముగ్గురు టీడీపీ అభ్యర్థుల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను కనబరచకుండా దాచిపెట్టారు. అయినా ఆ నలుగురి నామినేషన్లు ఆమోదం పొందాయి. తప్పులను అడగకుండా రిటర్నింగ్‌ అధికారులు వారి నామినేషన్లు ఎలా ఆమోదించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు తాను నివాసం ఉంటున్న ఇంటి అడ్రస్‌ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిగా పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నోటరీని మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన లాయర్‌ సీతారామ్‌ చేశారు. తన పరిధిలోకి రాని గ్రామాన్ని నోటరీ ఎలా చేస్తారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని చంద్రగిరి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఇతను సమర్పించిన అఫిడవిట్‌లో పులివర్తి నానికి సంబంధించిన ఆస్తుల వివరాలను దాచిపెట్టారు. పాకాల మండలం ఆదెనపల్లిలో ఖాతా నంబర్‌ 283తో 32 సర్వే నంబర్లలో సుమారు 10 ఎకరాలు ఉంది. అయితే నోటరీలో 8 సర్వే నంబర్లలో ఉన్న భూమిని మాత్రమే చూపించారు. పులివర్తి నాని భార్య కె.గానసుధ పేరున 1.30 ఎకరాలు ఉన్నట్లు చూపించారు. వాస్తవంగా ఆమె పేరున యాదమర్రి మండలం కుక్కలపల్లిలో సర్వే నంబర్‌ 510/4ఏలో మొత్తం 3.32 ఎకరాల భూమి ఉంది.  

సెంటు భూమి లేదు.. వ్యవసాయ ఆదాయం చూపారు 
గంగాధరనెల్లూరు టీడీపీ అభ్యర్థి గుమ్మడి హరికృష్ణ తనకు వ్యవసాయ భూమి లేదని చూపించారు. అయితే వ్యవసాయం ద్వారా రూ.5,88,650 ఆదాయం చూపించారు. తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురంలో ప్లాట్‌ నంబర్‌ 153, సర్వే నంబర్‌ 239/3, 3ఏని చూపించారు. అందులో విస్తీర్ణం, విలువ చూపలేదు. ఇంకా హరికృష్ణ తండ్రి 2014లో ఒక ప్లాట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ ప్లాటు విలువ అప్పట్లో రూ.9 లక్షలు. ప్రస్తుతం ఆ ప్లాటు మార్కెట్‌ విలువ చూపలేదు. ఇలా నలుగురు అభ్యర్థుల నామినేషన్‌ పత్రాల్లో అన్ని వివరాలను చూపించారా? లేదా? అని ప్రశ్నించకుండానే అధికారులు ఆమోదించటంపై విమర్శలు వస్తున్నాయి. 

కాలమ్స్‌ మాయం 
తిరుపతి టీడీపీ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుగుణమ్మ నామినేషన్‌ వేశారు. అయితే ఈమె సమర్పించిన అఫిడవిట్‌లో ఉండాల్సిన కాలమ్స్‌ మాయమయ్యాయి. తన అఫిడవిట్‌లోని 12వ పేజీలో ఉండాల్సిన మూడు కాలమ్స్‌ కనిపించలేదు. హెచ్‌యూఎఫ్, వారసులు 1, 2, 3 గడులు పూర్తి చేయాలి. అయితే సుగుణమ్మ సమర్పించిన అఫిడవిట్‌లో అవి కనిపించలేదు. 14వ పేజీలో వివరాలు మాత్రం చూపించారు. హోటల్, కారు, ఎయిర్‌ కండిషనర్, ఫర్నిచర్స్, మోటార్‌ వాహనం, ఇతరత్రా చూపించారు. అయితే అవి ఎవరికి చెందినవి అనే వివరాలు పొందుపరచలేదు. ఏడో గడిలో 6, 7, 8లో ఆస్తులను చూపించారు. అవి ఎవరివి అని స్పష్టం చెయ్యలేదు. ఇంకా 550 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపించారు. ఎవరిదనేది స్పష్టం చేయలేదు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top