రేషన్‌ డీలర్లను తొలగించే ప్రసక్తే లేదు : కొడాలి నాని

Ministers Kodali Nani Speech In AP Legislative Council Over Ration Cards - Sakshi

సాక్షి, అమరావతి : రేషన్‌ డీలర్లను తొలగించే ప్రసక్తే లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. గురువారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులనుంచి ఎదురైన ప్రశ్నలకు మంత్రులు సమాధానలిచ్చారు. ఈ సందర్భంగా రేషన్‌ కార్డులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. అక్టోబర్‌ 2 నుంచి గ్రామ వాలంటీర్ల ద్వారా కొత్త రేషన్‌ కార్డులిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ద్వారా అర్హులు కాని వారికి కూడా రేషన్‌ కార్డు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రేషన్‌ కార్డుల వ్యవస్థను గ్రామ సచివాలయాల ద్వారా పూర్తిగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. అర్హులకు మాత్రమే దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో రేషన్‌ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. అక్టోబర్‌ 2 వరకు కొత్త రేషన్‌ కార్డుల ఇవ్వమని చెప్పారు. రేషన్‌ డీలర్లను స్టాక్‌ పాయింట్‌గా పెడతామని.. వారికి వచ్చే కమిషన్‌ను కొనసాగిస్తామని అన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.


తెలుగు భాష అధికార ప్రతినిధిగా యార్లగడ్డ : అవంతి
తెలుగు భాషపై సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలకు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం తెలుగును నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. మాతృభాషను ప్రతి ఒక్కరు మర్చిపోవద్దన్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను తెలుగు భాష అధికార ప్రతినిధిగా త్వరలోనే నియమించనున్నట్టు ప్రకటించారు. రాబోయే రోజుల్లో జీవోలను తెలుగులో విడుదల చేస్తామని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగులో బోర్డులు పెట్టేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తెలుగు భాష అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

 
భూగర్భ డ్రైనేజీ పనులపై విచారణ జరిపిస్తాం : బొత్స
గుంటూరు భూగర్భ డ్రైనేజీ నిర్మాణంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. గుంటూరు భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి కేంద్రం నుంచి రూ. 540 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. కానీ ఇప్పటివరకు రూ. 391 కోట్ల పని మాత్రమే జరిగిందన్నారు. భూగర్భ డ్రైనేజీకి రూ. 363 కోట్లు ఇవ్వాల్సి ఉండగా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పటికీ రూ. 24 కోట్ల బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు. భూగర్భ డ్రైనేజీ పనులపై అనేక ఆరోపణలు వస్తున్నాయని చెప్పిన ఆయన.. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరిపిస్తామన్నారు. డ్రైనేజీ పనులు త్వరగా పూర్తయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణల కోసం సీఎం కమిటీ వేశారు : ఆళ్ల నాని
రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జవాబిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 1145 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల విషయంలో జీవో ఇచ్చిందని.. కానీ దానిని అమలు చేయలేదని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్యగ కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేయలేదన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణల కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కమిటీ వేశారని గుర్తుచేశారు. కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 


ఐటీ విధానాన్ని పున సమీక్షిస్తాం : గౌతమ్‌రెడ్డి
ఐటీ రంగంలో పెట్టుబడులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు తెస్తామని చెప్పి.. కేవలం 30 వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించిందని తెలిపారు. రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు తెస్తామని చెబితే.. కేవలం రూ. 1037 కోట్లు వచ్చాయన్నారు. ఐటీ విధానాన్ని పున సమీక్షిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలా తాము మాటలు చెప్పమని.. ఐదేళ్లలో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయని.. వాటిని కచ్చితంగా పరిశీలిస్తామన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top