మీ దిక్కున్న చోట చెప్పుకోండి   

Minister Tummala Nageswara Rao Was Angry On Congress leaders - Sakshi

కాంగ్రెస్‌ నేతలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం

రైతుల సంక్షేమానికి ఎన్ని పథకాలైనా ప్రవేశపెడతాం

సీతారామ ప్రాజెక్టుతో రెండు జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం

తిరుమలాయపాలెం : ఇన్నాళ్లు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్‌ నాయకులు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా జవాబు చెప్పారు. సోమవారం మండలంలోని పాతర్లపాడు గ్రామంలో రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సభలో మాట్లాడారు.

రైతాంగానికి సాగునీరు కల్పించడంతోపాటు, 24 గంటల విద్యుత్‌ అందించి అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు చేయడంతోపాటు రైతాంగానికి పెట్టుబడి సహాయం కింద తరతమ భేదం లేకుండా రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ.8 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్‌ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

రైతుల కళ్లల్లో ఆనందం వ్యక్తం అవుతుంటే ఓర్వలేని కాంగ్రెస్‌ నాయకులు రాజకీయ పబ్బం కోసం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం ఎన్ని పథకాలైనా ప్రవేశ పెడతామని, కాంగ్రెస్‌ నాయకుల్లారా.. ‘మీ దిక్కు న్న చోట చెప్పుకోండని’ధ్వజమెత్తారు. ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశ పెట్టామని రానున్న రోజు ల్లో వరినాట్లు వేసే యంత్రాలను కూడా అందిస్తామని తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాల చు ట్టూ తిరగకుండా రైతులు సాగుచేసుకుంటున్న భూములను భూ యాజమాన్య హక్కు పత్రాలు కల్పించేందుకు యావత్‌ అధికార యంత్రాంగాన్ని గ్రామాల్లోని రచ్చబండల వద్దకు పంపించి పైసా ఖర్చులేకుండా పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వ డం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. గత ంలో లాగా దొంగ పహాణీలు, పాస్‌ పుస్తకాలకు అవకాశం లేకుండా పాస్‌ పుస్తకాలు ఇస్తూ ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నట్లు వివరించారు.

గతంలో మంత్రిగా ఉన్నప్పటికీ ఆనాడు సాగునీరు కల్పించే అవకాశం లేకుండా పోయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారం, ప్రజల ఆదరాభిమానాలతో భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామని, త్వరలోనే సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు కల్పిస్తామని తెలిపారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలేరుని అగ్రగామిగా నిలుపుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీటి సమస్య, విద్యుత్‌ లోఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, జెడ్పీ సీఈఓ నగేశ్, ఆర్డీఓ పూర్ణచందర్‌రావు, ఎంపీపీ కొప్పుల అశోక్, తహసీల్దార్‌ కృష్ణవేణి, ఎంపీడీఓ వెంకటపతిరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ మద్దినేని మధు, జిల్లా సభ్యులు, నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు,  ఎంపీటీసీ సభ్యులు, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top