చంద్రబాబు కుతంత్రాలను ప్రజలు నమ్మరు

Minister Botsa Satyanarayana Fires On Chandrababu - Sakshi

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం కంటే పెన్షన్లు అదనంగానే ఇచ్చామని..7 లక్షల పింఛన్లు తొలగించామని టీడీపీ ప్రచారం చేయడం దారుణమన్నారు. ఆరు లక్షలకు పైగా కొత్త వారికి పెన్షన్లు మంజూరు చేశామని.. అనర్హుల జాబితా మరోసారి పరిశీలించి అర్హులైన వారికి పింఛన్లు ఇస్తామని వివరించారు. ప్రభుత్వంపై బురద చల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. ఆయన కుతంత్రాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.

ఏపీ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు 
కియా పరిశ్రమ తరలిపోతుందనే టీడీపీ నేతల దుష్ప్రచారం పై మంత్రి బొత్స తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు కొత్త డ్రామాలాడుతున్నారని నిప్పులు చెరిగారు. రోడ్డు మీద వెళ్లే వాళ్లకు సూటు,బూటు వేసి సమ్మిట్‌లు నిర్వహించారని.. రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా నష్టపోవాలన్నదే చంద్రబాబు ఆలోచన అని దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఆయన దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టకూడదని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

టీడీపీ ఎంపీలు అలా చెప్పటం దారుణం..
పార్లమెంటులో టీడీపీ ఎంపీలు అబద్ధాలు చెప్పటం దారుణమని.. మిలీనియం టవర్స్‌లో ఉన్న కంపెనీలను ఖాళీ చేయమని తాము నోటిసులు ఇవ్వలేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఎప్పుడైతే అసెంబ్లీ లో పెట్టామో... అప్పటి నుంచే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. తదుపరి కార్యక్రమాలన్నీ అడ్మినిస్ట్రేషన్ లో అంతర భాగాలేనని వివరించారు. రాజ్యాంగ పరంగానే జీవో లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కోర్టులను గౌరవిస్తూనే కార్యక్రమాలు చేపడుతున్నామని.. ఉద్యోగులకు సమస్యలు ఉంటే తమతో చర్చిస్తారని వెల్లడించారు. 

ప్రజలు అదే కోరుకుంటున్నారు..
‘ప్రజలందరూ రాజధాని త్వరగా తరలించాలని కోరుకుంటున్నారు. కార్యాలయం ఎక్కడ ఉండాలనేది ప్రభుత్వం ఇష్టం. గత ప్రభుత్వం నోటి మాట తో ముందుకు వెళ్ళింది. విజిలెన్స్ కార్యాలయం విజయవాడలో ఉండాలని చట్టం లో ఉందా?.. పరిపాలన సౌలభ్యం కోసమే విజిలెన్స్ కార్యాలయం తరలిస్తున్నామని’  బొత్స పేర్కొన్నారు.  బలవంతపు భూ సేకరణ చేసిన భూములు వెనక్కి ఇవ్వమని రైతులు కోరారని.. రోడ్లు కింద పోయే భూములు వేరేచోట ఇవ్వమని రైతులు అడిగారని తెలిపారు. దీన్ని పరిశీలించమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారని మంత్రి బొత్స వెల్లడించారు.

(చదవండి: కియాపై మాయాజాలం)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top