‘రూ. 5 కోట్ల పనిని రూ. 137 కోట్లకు పెంచారు’

Minister Anil Kumar Yadav Speech In Assembly Over Irrigation Projects - Sakshi

సాక్షి, అమరావతి : ఒక్క గేటు ప్రారంభ యాడ్‌ కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 2.30 కోట్లు ఖర్చు చేశారని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఆ గేటు పూర్తి కాకముందు ప్రారంభానికే చంద్రబాబు ప్రజాధనాన్ని దుబారా చేశారని మండిపడ్డారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. గత ప్రభుత్వ హయంలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అవకతవకలను పలువురు సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వ హయంలో ప్రాజెక్టుల అంచనాలను ఇష్టరాజ్యంగా పెంచేశారు. గాలేరు నగరి ప్రాజెక్టు ప్యాకేజి 29లో రూ. 171 కోట్లు పని అయితే రూ. 166 కోట్ల పని జరిగింది. మిగిలింది కేవలం రూ.5 కోట్ల పని మాత్రమే. కానీ ఆ ఐదు కోట్ల రూపాయల పనిని రూ. 137 కోట్లకు పెంచారు. ప్రాజెక్టులకు భారీ ఎత్తున రేట్లు పెంచిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు హయంలో నీటిపారుదల శాఖలో భారీ అవినీతి జరిగింది. ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి, అక్రమాలు చోటుచేసుకోకుండా.. దేశ చరిత్రలో రివర్స్‌ టెండరింగ్‌ తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది. దీని ప్రకారం జ్యూడిషియల్‌ అనుమతి తర్వాతే టెండర్‌ వస్తుంది. గత ప్రభుత్వానికి శిలాఫలకాలు తప్ప.. ప్రాజెక్టులు పూర్తిచేయాలన్న ధ్యాస లేకుండా పోయింది. మేజర్‌ ప్రాజెక్టులపై కమిటీలు వేస్తున్నామ’ని తెలిపారు.

అంతకుముందు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రాజెక్టుల అంచనాలు భారీగా పెంచి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అవినీతి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురంలో రూ. 150 కోట్ల పనులను గత ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న వారికి నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టారని తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో రూ. 6 కోట్లు అధికంగా చెల్లించారని అన్నారు. ప్రాజెక్టుల నిధుల కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లాయని విమర్శించారు. ప్రాజెక్టుల్లో అక్రమాలపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల అంచనాలు ఇష్టరాజ్యంగా పెంచేశారని మండిపడ్డారు. నిబంధనలకు విర్ధుంగా కాంట్రాక్టులను తమకు అనుకూలంగా ఉన్నవారికే కట్టబెట్టారన్నారు. గత ప్రభుత్వం హయంలో ప్రాజెక్టులో రూ. 60వేల కోట్ల దోపిడి జరిగిందని ఆరోపింది. ఈ దోచుకున్న సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో 23.49 లక్షల నీళ్లు వచ్చాయని గుర్తుచేశారు. చంద్రబాబు హయంలో రాష్ట్రం అప్పులమయంగా మారిందని తెలిపారు. పునరావాస కేంద్రాల పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ దుర్వినియోగమైంద’ని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top