లాక్‌డౌన్‌ కష్టాలు: మండిపడ్డ మాయావతి

Mayawati Slams Centre States Over Troubles Of Migrant Labourers Lockdown - Sakshi

లక్నో: లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస జీవుల కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. కరోనా(కోవిడ్‌-19) మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో దళితులు, ఆదివాసీల పరిస్థితి దయనీయంగా మారిందని.. అయినా వారి పట్ల ప్రభుత్వ వైఖరి ఏమాత్రం మారలేదని మండిపడ్డారు. కరోనాను కట్టడి చేసేందు మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మాయావతి మాట్లాడుతూ... ప్రభుత్వాలు వలస జీవులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.(ఆ విషయాన్ని రేపు ప్రధాని వెల్లడిస్తారు: జవదేకర్‌)

‘‘పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిలో 90 శాతం మంది దళితులు, ఆదివాసీలే... 10 శాతం పేదలు ఉన్నారు. విపత్కర పరిస్థితుల్లో స్వస్థలాలకు పయనమైన వారికి యజమానులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు... కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదు. వారిని ఆపడం లేదు. కనీసం నిత్యావసరాలు తీర్చే చర్యలు చేపట్టడం లేదు. వారిని సొంత ఊళ్లకు చేర్చే మార్గాలు అన్వేషించడం లేదు. అందుకే కాలినడకన స్వస్థలాలకు పయనమై ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నామ మాత్రంగా కొన్ని బస్సులు, ట్రక్కులు ఏర్పాటు చేసి వారిని తరలిస్తున్నారు. కొన్నిచోట్ల వెనక్కి పంపిస్తున్నారు. ఒకవేళ వారిలో ఎవరికైనా మహమ్మారి సోకి ఉంటే పరిస్థితి ఏంటి’’అని మాయావతి ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  (పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top