మంగళగిరి ఓటర్లకు ఫ్రిజ్‌లు, ఏసీల ఎర | Mangalagiri Voters Lured with ACs, Fridges | Sakshi
Sakshi News home page

పతనం అంచున ప్రలోభాలు

Apr 10 2019 10:59 AM | Updated on Apr 10 2019 11:13 AM

Mangalagiri Voters Lured with ACs, Fridges - Sakshi

సాక్షి, అమరావతి : ఓటమి భయంతో అధికార పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వానికి తెరతీసింది. డబ్బుతోపాటు మద్యం, బంగారం, వెండి, చీరలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, క్రికెట్‌ కిట్లు లాంటివి ఎరగా వేస్తోంది. టీడీపీ నేతలు పలు జిల్లాల్లో డబ్బు పంపిణీని అడ్డుకోకుండా పోలీసులపై ఒత్తిడి పెంచారు. సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు పోలీసు అధికారులు డబ్బులు చేరవేత నుంచి పంపిణీ వరకు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రలోభాలను అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమాలకు కొమ్ము కాయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళ్ల ముందే పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ సాగుతున్నా పోలీసులు ఉదాశీనంగా వ్యవహరించడంపై ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోతున్నారు.

మంగళగిరి ఓటర్లకు టీడీపీ ఫ్రిజ్‌లు, ఏసీల ఎర
రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో ఎదురీదుతున్న టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్‌ డబ్బు పంపిణీపైనే ఆధారపడినట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో ఇక్కడ లోకేశ్‌ తరపున పంచుతున్నారని చెబుతున్నారు. అధికార పార్టీ నేతలు ఐదు నుంచి పది ఓట్లు ఉన్న వారి ఇళ్లకు వెళ్లి ఫ్రిజ్, ఏసీ తదితర గృహోపకరణాలు ఎరగా చూపి కోడ్‌ నెంబర్‌తో కూడిన స్లిప్‌లను అందిస్తున్నారు. ఈ స్లిప్‌ తీసుకుని విజయవాడలోని ఓ షోరూమ్‌కు వెళితే అందులో పేర్కొన్న వస్తువులను ఇచ్చి పంపిస్తుండటం గమనార్హం. 

దేవినేని కుటుంబం ధన రాజకీయాలు
గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో డబ్బులతో పట్టుబడిన టీడీపీ శ్రేణులను కేసుల నుంచి తప్పించారనే ఆరోపణలున్నాయి. కృష్ణా జిల్లాలో టీడీపీ అభ్యర్థులు రూ.500 నుంచి రూ.2 వేలు వరకు పంచారు. గుడివాడ నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌ రూ.3 వేల నుంచి రూ.5 వేలు చొప్పున పంచుతున్నట్లు చెబుతున్నారు. మైలవరంలో ఎదురీదుతున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డబ్బు పంపిణీతోపాటు అపార్టుమెంట్లు, కాలనీలు, వార్డులు వారీగా పెద్ద మొత్తాలు, నజరానాలు ఇస్తూ ఓటర్లను ప్రభావితం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఉభయ గోదావరిలో జనసేన పోటాపోటీ పంపిణీ
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన కార్యకర్తలు పవన్‌ గెలుపు కోసం రూ.వెయ్యి చొప్పున పంపిణీ ప్రారంభించారు. జిల్లాలో టీడీపీ అభ్యర్థులతోపాటు జనసేన కూడా పోటీ పడి డబ్బులు పంచడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లాలో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2,500 వరకు నియోజకవర్గాలవారీగా పంపిణీ మొదలైంది.  

నారాయణ కాలేజీలే కేంద్రంగా..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ కాలేజీ కేంద్రంగా డబ్బు పంపిణీ జరగడం అధికార పార్టీ అక్రమాలకు పరాకాష్ట. అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ డబ్బు పంపిణీ జోరుగా జరుగుతోంది. ధర్మవరం, రాప్తాడు, తాడిపత్రిలో టీడీపీ ఓటుకు రూ.2 వేల నుంచి ఐదు వేల వరకు పంచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement