చంద్రబాబుకు మోహన్‌బాబు సవాల్‌

Manchu Mohan Babu Joins In YSR Congress Party - Sakshi

సీనియర్‌ నటుడు, కలెక్షన్‌ కింగ్ మోహన్‌బాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ రోజు ఉదయం కుమారుడు విష్ణుతో కలిసి లోటస్‌పాండ్‌కు చేరుకున్న ఆయన, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోహన్‌బాబు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇన్నేళ్లకు మరో పార్టీలో చేరినట్టు వెల్లడించారు.

ఎన్టీఆర్ పదవీచ్యితుడయిన తరువాత ఆయన వద్దు అంటున్నా మేజర్‌ చంద్రకాంత్‌ సినిమా తీసి.. వందల సభల్లో పాల్గొని ఆయన గెలుపుకోసం కృషి చేశానన్నారు. తర్వాత  పలు సందర్భాల్లో బీజేపీకి సపోర్ట్ చేసినా పార్టీలో మాత్రం చేరలేదన్నారు. మహానాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌ స్థాపించిన పార్టీ ఇది. ఆయన ఆలోచన, ప్రజలకు సేవ చేయాలన్న తపన నచ్చి ఈ పార్టీలో చేరానని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు త్వరలో ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు.

‘పదవులు కావాలంటే గతంలోనే పార్టీలో చేరేవాడిని. తనకు అలాంటి కోరిక లేదు, జగన్‌ నా బంధువని ఈ పార్టీలో చేరలేదు. తెలుగు ప్రజలకు మంచి చేస్తున్నాడు, చేయబోతున్నాడు. జగన్‌ గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్న నమ్మకంతోనే ఈ పార్టీలో చేరాన’ని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదంపై మోహన్‌బాబు స్పందిస్తూ.. ‘దాదాపు మూడు నాలుగేళ్లుగా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడాను. తరువాత ఉత్తరాలు రాశాను కానీ సరిగ్గా స్పందించలేదు. ఈ నాలుగున్నర సంవత్సరాలు చంద్రబాబు మట్టి, ఇసుక, భూములను దోచుకుని భూస్వామి అయ్యాడు. ప్రారంభంలో నీ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత. 1975 నుంచి నా సంపాదన వివరాలు ఇస్తా... చంద్రబాబు ఇవ్వగలడా’ అని మోహన్‌బాబు సవాల్‌ విసిరారు.

19 కోట్లకు పైగా రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రావాల్సి ఉందని, ఆస్తులు తాకట్టు పెట్టి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నా అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆంధ్ర ప్రజలను కొడుతున్నారన్న పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలపై మోహన్‌బాబు స్పందించారు. తెలంగాణలో ఆంధ్ర ప్రజల మీద ఎవరూ దాడి చేయటం లేదు, చేయరు కూడా అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top