మంచిర్యాల నుంచి పోటీ మంచిది!

Manchiryal good for the competition! - Sakshi

కోదండరాంకు సన్నిహితుల సూచన

పోటీ చేయకుండా రాష్ట్రవ్యాప్త ప్రచారం చేయాలంటున్న మిత్రపక్షాలు

తేల్చుకోలేకపోతున్న టీజేఎస్‌ అధినేత

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం పోటీ చేయాల్సిన నియోజకవర్గంపై తర్జనభర్జన జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీల ఐక్యకూటమి అభ్యర్థిగా ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో కోదండరాం తేల్చుకోలేకపోతున్నారు.

కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఐక్యంగా పోటీచేయాలని ప్రాథమికంగా నిర్ణయం జరిగింది. ఈ కూటమిలో ఏయే పార్టీ, ఎన్ని స్థానాలకు పోటీ చేయాలనే దానిపై ఇంకా చర్చలు సాగుతున్నాయి.  ఉమ్మడి మేనిఫెస్టో అమలు కమిటీకి కోదండరాం చైర్మన్‌గా ఉండాలని అన్నిపార్టీలు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి. కూటమి అభ్యర్థిగా కోదండరాం పోటీపై సందిగ్థత కొనసాగుతోంది.  పోటీచేయాలా, పోటీకి దూరంగా ఉండాలా అనే దానిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

జనగామ లేదావరంగల్‌ పశ్చిమ
కోదండరాం స్వగ్రామం మంచిర్యాల పరిధిలో ఉంది. దీనితోపాటు తెలంగాణ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉండటం, కోదండరాంకు ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పరిచయాలు, సంబంధాలుండటం వంటి కారణాలతో మంచిర్యాలలో పోటీ చేయ డం మంచిదని అంటున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు పరిసరాల్లో ఉండే నియోజకవర్గం అయితే సౌకర్యంగా ఉంటుందని మరికొందరు వాదిస్తున్నా రు. వరంగల్‌ పశ్చిమ, జనగామ నియోజకవర్గంలో  పోటీ చేయాలని కొందరు కోరుతున్నారు.

సికింద్రాబాద్‌ నియోజకవర్గం కూడా అనుకూలంగానే ఉంటుందని కొందరు ప్రతిపాదిస్తున్నారు. అయితే, మంచిర్యాల లేదా జనగామ నియోజకవర్గాల్లో ఏదో ఒకదానిలో పోటీ చేసే అంశంపైనే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.  శాసనసభకు పోటీ చేయకుండా కనీస ఉమ్మడి కార్యక్రమాల అమలు కమిటీకి చైర్మన్‌గా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తే మంచిదని మిత్రపక్షాల నేతలు అంటున్నారు.  ఉద్యమసమయంలో తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా ఉన్న కోదండరాంకు యువత, ఉద్యోగులు, విద్యా ర్థులు, తెలంగాణవాదుల్లో క్రేజ్‌ ఉందని, సీఎం కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా కోదండరాంను ఉద్యమశక్తులు ఆమోదిస్తాయని, దీనిని ఓట్లుగా మార్చుకునే వ్యూహంతో పనిచేయాలని వాదిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top