మోదీ నిర్ణయం.. మమత షాక్‌

Mamata Banerjee Unhappy with PM Modi Decision - Sakshi

కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఓ నిర్ణయం పట్ల పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం శాంతినికేతన్‌లోని విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ హాజరయ్యారు. అయితే యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా అందించే దేశికొత్తమ్‌ అవార్డుల ప్రదానొత్సవంలో మాత్రం ఆయన పాల్గొనట్లేదు. దీంతో అవార్డుల వేడుక లేనట్లేనని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. 

ప్రధాని బిజీ షెడ్యూల్‌ కారణంగా అవార్డులను అందించలేరని ప్రధాని కార్యాలయం బెంగాల్‌ ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ పరిణామాలపై సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఎంవో కార్యాలయం ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉందని ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఈ వ్యవహారంపై యూనివర్సిటీ అధికారులు స్పందిస్తూ.. గతంలోనూ ఇలాంటి పరిణామాలు జరిగాయని చెబుతున్నారు. అయితే గత ఐదేళ్లుగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమం.. ఈసారి జరిగి తీరుతుందని అంతా భావించారు. ఇదిలా ఉంటే ఈ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అతిథులతో వేదిక పంచుకోవటం గమనార్హం. 

అవార్డుల జాబితాపై కూడా... అవార్డుల ఎంపిక పైనా మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వభారతి అకాడమీ కౌన్సిల్‌ ఈనెల మొదట్లో దేశీకొత్తమ్‌ అవార్డుల కోసం పలువురు ప్రముఖుల పేర్లను ఎంపిక చేసింది. జాబితాలో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌, రచయిత అమితవ్‌ ఘోష్‌, ప్రముఖ కవి గుల్జర్‌, పెయింటర్‌ జోగెన్‌ చౌదరి, ద్విజెన్‌ ముఖర్జీ తదితరుల పేర్లు ఉన్నాయి. అయితే అమితాబ్‌తోపాటు ద్విజెన్‌ పేర్లను అవార్డుకు ఎంపిక చేయలేదు. ‘అర్హత ఉన్న వారికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారో తెలీట్లేదు. ఈ నిర్ణయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది’ అంటూ ఆమె మీడియా ఎదుట అసహనం వ్యక్తం చేశారు. 

స్నాతకోత్సవ కార్యక్రమంలో... ప్రధాని నరేంద్ర మోదీ విశ్వ భారతి యూనివర్సిటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక​ హసీనా కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఇరు ప్రధానులతోపాటు సీఎం మమతా బెనర్జీ వేదికను పంచుకున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీకి స్వ​యంగా మమతా ఆహ్వానం పలికి, యూనివర్సిటీకి వెంటబెట్టుకొచ్చారు. స్నాతకోత్సవం ముగిశాక బంగ్లాదేశ్‌ భవన్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

వీడియోపై పేలుతున్న జోకులు.. ఇటీవల కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎం మమతా బెనర్జీ కర్ణాటక డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొద్ది దూరం నడవాల్సి రావటంతో ఆమె డీజీపీ నీలమణి రాజుపై చిందులు తొక్కారు. ఆ పరిణామంతో కుమారస్వామి-దేవగౌడలు కూడా బిత్తరపోయారు. అనంతరం ఆ డీజీపీని బదిలీ చేస్తూ కుమారస్వామి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ప్రధాని రాక సందర్భంగా ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హెలిప్యాడ్‌కు దూరంలో ఉన్న మమతను ఇటువైపుగా రావాలంటూ ప్రధాని మోదీ సైగలు చేయటం, ఆమె అక్కడి దాకా నడుచుకుంటూ వచ్చి మోదీకి పుష్ఫగుచ్ఛం అందించటం చూడొచ్చు. మరి తనను అంత దూరం నడిపించిన మోదీపై మమత ఎవరికి ఫిర్యాదు చేస్తుందో చూడాలంటూ పలువురు సెటైర్లు పేలుస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top