మహారాష్ట్ర అసెంబ్లీలో ‘గుజరాతీ’ కలకలం

Maharashtra CM Devendra Fadnavis apologises for Gujarati translation of Governor's speech in assembly - Sakshi

మరాఠీకి బదులుగా గుజరాతీలో గవర్నర్‌ ప్రసంగం ప్రసారం

ముంబై: మహారాష్ట్రలో బీజేపీ–శివసేన సంకీర్ణ ప్రభుత్వం సోమవారం వివాదంలో చిక్కుకుంది. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు ఉభయసభలను ఉద్దేశించి ఆంగ్లంలో మాట్లాడగా, సభ్యుల హెడ్‌ఫోన్లలో ఆ ప్రసంగ అనువాదం మరాఠీకి బదులు గుజరాతీ భాషలో వచ్చింది. ఈ ఘటనతో సభలో కలకలం చెలరేగింది. వెంటనే స్పందించిన సీఎం ఫడ్నవీస్‌.. ఈ ఘటనపై సభ్యులందరికీ క్షమాపణలు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.

బాధ్యులపై వీలైతే సోమవారం సాయంత్రంలోపే చర్య తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికే దాని అనువాదం గుజరాతీలో ప్రసారం కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు నిరసనగా ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశాయి. అయితే ఈ ఘటన సాంకేతిక సమస్య వల్ల జరిగిందా? లేక మరేదైనా కారణముందా? అన్న విషయమై ఎలాంటి స్పష్టతా రాలేదు. మరాఠీ భాషా దినోత్సవానికి(ఫిబ్రవరి 27) ఒక్కరోజు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top