గెలుపెరుగని యోధుడు

Loksabha Contested And Lossed In 175 elections From Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై: భారత ఉపఖండంపై 17 సార్లు దండయాత్ర చేసిన గజనీ మహ్మద్ను గుర్తు చేస్తున్నాడో తమిళ తంబి. బంగారంపై ఆశతో గజనీ భారత్‌పై పట్టు వదలని విక్రమార్కుడిలా దాడి చేయగా.. తమిళనాడుకు చెందిన పద్మరాజన్‌ మాత్రం ఎన్నికల్లో ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్లీ మళ్లీ పోటీ చేస్తునే ఉన్నాడు. తమిళనాడులోని సాలెం జిల్లాకు చెందిన పద్మరాజన్‌, మహామహులనదగ్గ నాయకులు బరిలో నిలిచే స్థానాల్లో పోటీ చేస్తుంటాడు. 1988 నుంచి ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పద్మరాజన్‌ పోటీ చేశాడు. ఎన్నికల బరిలో నిలిచిన ప్రతీసారి ఓటమిపాలైన నేతగా అతడికి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కడం కొసమెరుపు. పద్మరాజన్‌ను అందరూ ముద్దుగా ఎలక్షన్‌ కింగ్‌ అని పిలుస్తుంటారు. 

మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, అటల్‌ బిహారీ  వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్, తమిళనాడు మాజీ సీఎంలు పురుచ్చితలైవి జయలలిత, కరుణానిధి, మాజీ రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, డీఎంకే  అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, డీఎండీకే చీఫ్‌ విజయ్‌కాంత్‌తోపాటు  ఇలా చాలామంది ప్రముఖులతో పద్మరాజన్‌ పోటీ పడటం విశేషం. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో జరిగిన అనేక ఎన్నికల్లో పద్మరాజన్‌ పోటీపడ్డారు. 1988 నుంచి 2016 వరకు చాలా ఎన్నికల్లో పోటీపడిన అతడు, మొత్తం 178 ఓటములను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకవేళ మీరు విజయం సాధిస్తే ఎలా సెలబ్రేట్‌ జరుపుకుంటాని అడిగితే.. ‘నేను ఎన్నికల్లో గెలిస్తే, నాకు గుండె నొప్పి రావడం ఖాయమ’ని అని పద్మరాజన్‌ చమత్కరిస్తుంటాడు. ప్రజల్లో చెతన్యం తీసుకురావడంతోపాటు రికార్డులను నెలకొల్పడమే తన ధ్యేయమంటూ సాగుతున్నాడీ గెలుపెరుగని యోధుడు.

వృత్తిరీత్యా హోమియోపతి వైద్యుడైన పద్మరాజన్‌ తన కష్టంతో సంపాదించిన డబ్బులతోనే ఎన్నికల్లో పాల్గొంటున్నానని తెలిపాడు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పద్మరాజన్‌ తమిళనాడులోని ధర్మపురి నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా, పట్టలి మక్కల్‌ కచ్చి నాయకుడు అన్బుమని రామదాస్‌తో పోటీకి సై అంటున్నారు. ఒకవేళ రాహుళ్‌ గాంధీ కాసర్‌గాడ్‌ నుంచి కాకుండా వయానాద్‌ నుంచి పోటీ చేస్తే, ఆయనకు పోటీగా తానూ అక్కడి బరిలో నిలుస్తానని, త్వరలోనే తన ఓటములతో డబుల్‌ సెంచరీ చేయడం ఖాయమని నవ్వుతూ చెప్పాడీ రికార్డుల రాజన్‌.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top