అమ్మాయి.. మద్యం.. ఇదీ ఆయన బాగోతం!!

Liquor war : JDU takes on RJD Tejaswi old photo - Sakshi

ఆర్జేడీ నేత తేజస్వీ ఫోటో అస్త్రంగా జేడీయూ విమర్శల దాడి

ఆమె ఎవరో కూడా తెలియదు.. అది 2010 ఫొటో : తేజస్వీ వివరణ

మద్యనిషేధంపై బిహార్‌ పార్టీల వింతపోకడలు

పట్నా : మద్యనిషేధం అంశంపై బిహార్‌ అధికార, విపక్షాల మధ్య విమర్శ, ప్రతివిమర్శలు వెగటుపుట్టిస్తున్నాయి. నిషేధం కొనసాగుతున్నప్పటికీ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, సాక్షాత్తూ సీఎం నితీశ్‌ కుమార్‌, జేడీయూ నేతలంతా లిక్కర్‌ మాఫియాకు దన్నుగా నిలిచారని ఆర్జేడీ ఆరోపించింది. ప్రతిపక్షం ఆరోపణలను తిప్పికొడుతూ ‘లాలూ కుటుంబీకులే పెద్ద తాగుబోతుల’ని జేడీయూ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలోనే జేడీయూ నాయకుడొకరు.. ఆర్జేఎల్పీ నేత తేజస్వీ ఒక అమ్మాయితో కలిసున్నప్పటి ఫొటోను మీడియాకు విడుదల చేశారు. దానిపై తేజస్వీ కూడా వివరణ ఇచ్చుకున్నారు.

జేడీయూ నేతల ఇళ్లల్లో మద్యం బాటిళ్లు : బిహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం అమలు కావడంలేదని, జేడీయూ నేతలు వారి ఇళ్లల్లో మద్యం బాటిళ్లు దాచుకున్నారని ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌ ఆరోపించారు. ఆయన కుమారుడు, ప్రస్తుత బిహార్‌ ప్రతిపక్షనేత తేజస్వీ మరో అడుగు ముందుకేసి.. లిక్కర్‌ మాఫియాతో సీఎం అంటకాగుతున్నారని విమర్శించారు.

జేడీయూ ఘాటు సమాధానం : ఆర్జేడీ ఆరోపణలపై జేడీయూ ఘాటుగా స్పందించింది. శుక్రవారం జేడీయూ అధికారప్రతినిధులు సంజయ్‌ సింగ్‌, నీరజ్‌ కుమార్‌లు మీడియాకు ఒక ఫోటోను విడుదల చేశారు. ‘పక్కనే అమ్మాయి, చేతిలో బీరు బాటిల్‌.. ఇదీ ఆయన బాగోతం’ అని తేజస్వీపై విరుచుకుపడ్డారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తేజస్వీ బిహార్‌ భవన్‌లో కాకుండా ప్రైవేటు ఇంట్లో ఉంటారని, అక్కడ మద్యం సేవిస్తారని జేడీయూ నేతలు చెప్పుకొచ్చారు. లాలూకు దమ్ముంటే కొడుక్కి రక్తపరీక్షలు నిర్వహించాలని సవాలు విసిరారు.

ఆమె ఎవరో తెలియదు : జేడీయూ నేతలు విడుదల చేసిన ఫొటోపై ప్రతిపక్షనేత తేజస్వీ స్పందించారు. ‘‘అది 2010నాటి ఫొటో. అప్పట్లో నేను క్రికెట్‌ ఆడుతుండేవాడిని. బహుశా, ఐపీఎల్‌ వేడుకలో భాగంగా దిగింది కావచ్చు. అసలా అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు’’ అని తేజస్వీ వివరణ ఇచ్చారు. పాత ఫోటోలు పట్టుకుని జేడీయూ రాజకీయాలు చేయాలని చూస్తోందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వంపై పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top