పంట నష్టం ఇవ్వని వ్యక్తి ఏం శుభవార్త చెప్తారు?

Lets Ready For Fight Against TRS Party Said Tpcc Uttam Kumar Reddy - Sakshi

టీఆర్‌ఎస్‌ పాలనపై పోరాటానికి సిద్ధంకండి: ఉత్తమ్‌

సాక్షి,హైదరాబాద్‌: ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించలేని ముఖ్యమంత్రి రాష్ట్ర రైతాంగానికి ఏం శుభవార్త చెప్తారని టీపీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌ నుంచి శనివారం జూమ్‌ యాప్‌ ద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ చెబుతున్న దానికి, చేసే దానికి పొంతన ఉండదని, ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ఎన్నికల హామీ కింద రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు చేయని వ్యక్తి, కనీసం రైతుబంధు కూడా అందరికీ ఇవ్వలేని వ్యక్తి ఇంకా ఏం శుభవార్త చెప్తారని, రైతులు దేని కోసం ఎదురుచూడాలని ఆయన ఎద్దేవా చేశారు.

అదనంగా ఒక్క ఎకరం కూడా తడవలేదు
రాష్ట్రంలోని రైతాంగానికి ఇప్పటివరకు అప్పట్లో నిజాం కట్టిన ప్రాజెక్టులు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే సాగునీరు అందుతోందని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీరు పారలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఉత్తమ్‌ చెప్పారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందలేదన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని కోరారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని, కేసీఆర్‌ అక్రమ సంపాదనతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ వారికి అందుబాటులో ఉండాలని  పిలుపునిచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు అమానవీయం
వలస కార్మికుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నాయని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఇందిరారావు ఆధ్వర్యంలో..హైదరాబాద్‌ కింగ్‌ కోఠిలోని షేర్‌ గేట్లో మూడు వందలమంది నిరు పేదలకు ఉత్తమ్‌ తో పాటు పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు అంజనీ కుమార్‌ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top